Friday, April 25, 2008

పడుగు పేకల మధ్య జీవితం

శీలా వీర్రాజు మంచి కథా రచయిత, నవలా రచయిత, చిత్రకారుడు, కవి, ఇంకా వివిధ రూపాల్లో ఎంతగానో ఎదిగిన ఒక మహా వ్యక్తి. కవిత్వాన్ని వచన రూపంలో చెప్పిన తీరు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఈ విధంగా వచన కవిత్వాన్ని వివిధ అంశాలపై రాశారు. అలా ప్రచురితమైన అన్ని కవితలను ఒకే సంపుటిలో అందచేయాలనే ఉద్దేశంతో ప్రచురించిన పుస్తకం, "శీలా వీర్రాజు కవిత్వం". ఆరు వచన కవితలు, కొన్ని విడి కవితలతో కలిసి ఉన్న ఈ పుస్తకం ఒక్కటి చాలు ఆయన సాహిత్యాభిలాషని, జీవితానుభవాలను, జీవిత విశేషాలను సులభంగా తెలుసుకోవడానికి. ఈ ఆరు వచన కవితల్లో ఒకటైన 'పడుగు పేకల మధ్య జీవితం' ఆయన ఆత్మ కథకు రూపం. పడుగు పేకల మధ్య జీవితం అనగానే ఎవరైనా బడుగు ప్రజల జీవితం అనుకుంటారు కానీ నిజానికి ఇది ఆయన సొంత జీవితం. ఆ పరిచయం ఇప్పుడు మీకోసం....

ఆత్మకథను కథగా రాయడం తేలికే. కానీ దాన్ని కవితగా, నలుగురికీ సులభంగా అర్థమయ్యే రీతిలో రాయడమంటే మాటలేం కాదు. అలాంటిది తన ఆత్మ కథను కవితా రూపంలో ఉంచి, అది చదివిన వాళ్ళు తాము కూడా తమ స్వీయ జీవితాన్ని కూడా అలా రాస్తే బావుంటుందన్న భావనకు రాగలగడం దీని ప్రత్యేకత. ఈ కవితలో మూడు భాగాలున్నాయి. మొదటి భాగంలో ఎం తో సరదాగా సాగిన ఆయన బాల్య జీవితం,అందరికీ తమ జీవితాలకు ఎంతో ఉపయోగపడే చదువును రెండో భాగంలో, ఆ తరువాత జీవితాన్ని ఆనందమయం చేసుకోడానికి, ఆర్థికంగా ఏ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కావల్సిన ఉద్యోగం, ఆ క్రమంలో ఆయన చేసిన ప్రయత్నాలు, ఎదుర్కొన్న బాధలు, చివరిగా జీవితానికి చివరి దాకా, తోడుగా ఉండేందుకు చేసిన ప్రయత్నం, పెళ్ళి అనే అంశాలను మూడో భాగంలోనూ తనదైన శైలిలో కవీత్వీకరించారు. జీవితం అంటే ఇలాగే ఉంటుందని, ఒడిదుడుకులెదురైనా మంచి కుటుంబం, స్నేహితులు, ముఖయంగా ఏదైనా సాధించాలన్న తపన ఉంటే తప్పకుండా మనం మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.

ఎటువంటి కష్టాలు లేకుండా ఎంతో ఆనందంగా సాగే బాల్యం ఆయన జీవితంలో ఎలా సాగిందో చెప్పిన తీరు, ఆయన నివసించిన ప్రాంతం, గోదావరి వర్ణన, ఆ రోజుల్లో జరిగిన యుద్ధ సమయంలో ఎలా ఉండేది, తనకు చదువు చెప్పిన గురువులు, తనలోనూ బొమ్మలు వేసే ఓ కళ దాగుందని తెలిసి కలిగిన ఆనందం, పండుగుల వేళ జరిగే ఉత్సవాలు, స్నేహితులతో కలిసి ఆడిన ఆటలు అన్నీ కళ్ళకు కట్టినట్లు, మనసుకు హాయి కలిగేట్టు వివరించారు.

ఇరుకు గదుల ఇంట్లో ఉమ్మడి కుటుంబంతో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులున్నా అభిమానం, ఆప్యాతలున్న చోట కష్టాలైనా కనుమరుగవుతాయాని ఇట్టే అర్థమవుతుంది ఆ వచన కవిత ద్వారా. తన భవిష్యత్ సాహిత్య జీవితానికి బాల్యంలోనే పునాది పడిందని చెప్పడంలో ఆనందం కనిపిస్తుంది. ఏదైనా మంచి పనుల్లో విజయం సాధించినందుకు పరోత్సాహకరంగా ఇచ్చే కానుకల్లో, వాటినిచ్చిన వ్యక్తుల గొప్పతనాన్ని పరిశీలించాలని కూడా తెలుసుకోవచ్చు మనం. ఇలాంటి మంచి అంశాల్ని, జీవిత సూత్రాల్ని తన బాల్యం ద్వారా తెలుసుకుంటూనే మనకు తెలియకుండా రెండో భాగానికి చేరుకుంటాం.

బాల్యం అయిపోయింది. ఎంతో ఆనందంగా ఉండాలి, అందంగా కన్పించే ప్రతీ వాటినీ ఆస్వాదించాలన్న కోరిక ఒక వైపు, మరో వైపు రాబోయే జీవితంలో ఆనందంగా ఉండాలంటే వచ్చిన ప్రతీ అవకశాన్ని ఆచి తూచి ఆలోచించి, సద్వినియోగపరుచుకుంటూ, విద్యను అశ్రద్ధ చేయకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన కౌమార దశ. అందుకేనేమో యావదాంధ్రలోనే మొట్టమొదటి కళాశాలలో తానూ ఒక విద్యార్థినని గర్వంగా చెపారు శీలా వీర్రాజు. పెద్దవాళ్ళకు భారం కాకుండా ఓ పక్క చదువుకుంటూ, మరో పక్క తమలో ఉన్న వేరేదైనా కళను ప్రదర్శిస్తూ, తద్వారా ఎంతో కొంత సంపాదిస్తూ, లేదంటే బాగా చదివి స్కాలర్షిప్ల ద్వారానైనా కొంత మొత్తాన్ని పొందుతూ, తమ తల్లిదండ్రుల బాధ్యతలో కొంతైనా తలకెత్తుకుని, తమ వంతు బాధ్యతను నిర్వర్తించవచ్చని, చదువుకునే విద్యర్థులు ఓసారి ఆలోచించుకునేలా చేస్తుందీ కవిత. అయితే ఏదైనా సాధించలంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలే కాని ఆత్మాభిమానాన్ని కోల్పోకూడదు. అలా చేయాల్సి వస్తే ఆ పని ఆ విధంగా చేసే కన్నా చేయకుండా ఉండడమే మేలన్నది తాను నేర్చుకున్నారు, తన జీవితానుభవం నుండి మనమూ నేర్చుకోగల మంచి పాఠం.

ఇక ముఖ్యమైంది జీవితంలో స్థిరపడడం. ఈ విషయంలో ఎక్కడా ఏ విధంగా రాజీ పడకూడదని మనకిష్టమైంది చేస్తేనే త్రుప్తిగా, సంత్రుప్తిగా ఉండగలమని ఋజువైందీ కవితలో మరోసారి. అందుకు తగ్గట్టే ప్రభుత్వ ఉద్యోగమొచ్చినా ఆయనకిష్టమైన సాహిత్య రంగంలోనే సంపాదకునిగా స్థిరపడాలనుకున్నారు. అందుకు వేరే ఊరికి మారి అక్కడ ఎన్నో కష్టాలు పడినా ఇష్టమైన ఉద్యోగం కనుక వదిలి వెళ్ళకుండా అక్కడే ఉండి ఆ ఉద్యోగంలోనే ఆనందాన్ని వెతుకున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయముంది, ఎంతిష్టమైన ఉద్యోగమైనా ముందుగా చెప్పినట్లు ఆత్మాభిమానాన్ని కోల్పోవాల్సి వస్తే మాత్రం ఆ ఉద్యోగాన్ని వదలక తప్పదు. అదే చేసారయన. కానీ, సధించాలన్న తపనుంటే ఒడిదుడుకులెన్నెదురైనా సరే తమలో కళ సజీవంగానే ఉంటుంది, అదే బతుకునీడ్చుకొస్తుందని, ప్రముఖులతో పరిచయాలు పెంచుకునేందుకు తోడ్పడుతుందని ఆయన సాహిత్య జీవితాన్ని చూస్తే అర్థమ్వుతుంది. దీనినే ఈ కావ్యం మూడో భాగంలో చూడొచ్చు.

తొలి జీతం, అందులో సగం అమ్మా నాన్నలకిస్తే ఉండే ఆనందం దాదాపుగా అందరూ అనుభవించేదే. ఆ అనుభవాన్ని మాటల్లోకంటే కవితా రూపంలో చక్కగా చెప్పారు. ఒక ప్లాన్ వేస్తూ ముందుకు సాగితే మనం ఒకటి, రెండు పనులకన్నా మరో ఒకటి, రెండు పనులు నీట్గా చేసి, పేరు, డబ్బు, కీర్తిలను సంపాదించుకోవచ్చ్చని, అయితే ఏ అంశంలోనైనా చేయాలన్న కసి, కృషి,తపనలు ఉండి తీరాలన్నది అందరూ గుర్తుంచుకోవాల్సిన సత్యం. స్నేహితులుంటే ఆ సరదనే వేరు. స్నేహానికి ఎంతటి విలువనివ్వాలో అంతే విలువనిచ్చారు కవి. స్నేహాన్ని ప్రేమగా చూడాలే కానీ, డబ్బుతో కొనకూడదన్న మరో వాస్తవాన్ని గుర్తు చేసారు.

కవి రచించిన ఇతర రచనలు, కవితలు, పొందిన సన్మాన, సత్కారాలను వివరించారు. పల్లెటూళ్ళ అందాలను, పట్నంలో ఏకాకి జీవితంలో ఉండే కష్టాలను, వాటిని తాను ఎదుర్కొన్న సందర్భాలను చెప్పారు. ఒకానొక సందర్భంలో ఆయనకు లభించిన గౌరవానికి గర్వపడ్డానని నిజాయితిగా, సగర్వంగా చెప్పుకున్నారు. ప్రత్యేకంగా మరో కవితను కూడా పొందుపరిచారు. అయితే జీవితమన్నాక కష్టసుఖాలుంటాయిగా. ఆత్మీయులను కోల్పోతాం, తల్లిదండ్రులను కోల్పోతాం. కానీ వాళ్ళున్న రోజుల్లోనే మనం మంచి పేరు తెచ్చుకుంటూ, తద్వారా మన తల్లిదండ్రులకు గొప్ప పేరు తెస్తే, అందుకు వాళ్ళు పొందే ఆనందం చాలదా మన జీవితానికి. అదే సాధించారాయన. అదే అందరం సాధించాలి. ఇలా తన స్వీయ చరిత్రలో బాల్యం నుండీ ఉన్న అమూల్యమైన తీపి జ్ఞాపకాలను, కొన్ని అవమానాలు, వాటికి ఆయన స్పందించిన తీరు, నేర్చుకున్న పాఠాలు, చదువుకోవాలన్న పట్టుదల, స్నేహం, సాహితీవేత్తలతో ప్రత్యేకమైన స్నేహం, పొందిన ప్రశంసలను వివరిస్తూ, సంగీత,సాహిత్యాల పట్ల ఎంతో మక్కువున్న ఆయన మేనమామ కూతురు సుభద్రా దేవితో జరిగిన తన వివాహం వరకే రాసి ముగించారు.

శీలా వీర్రాజు రాసిన వచన కవితా తీరు అద్భుతం, చేసిన సాహసం ప్రశంసనీయం.

శీలా వీర్రాజు వచనా కవిత్వం
రాగాలు పలికే సుందర జలపాతం
లోతైన భావాలున్న సముద్ర గర్భం
సులభంగా అర్థమయ్యే కావ్యరూపం
ఈ అద్భుతం నిజంగా ప్రశంసనీయం
కాగలదు అందరికీ మార్గదర్శకం.