Monday, November 26, 2007

సూర్యుడు వస్తూ వెలుతురును తెస్తాడు
వెళ్తూ ఆ వెలుతురును తీసి చీకటినిస్తాడు
చంద్రుడు వస్తూ ఆ చీకటికి వెలుగు తెస్తాడు
వెళ్తూ వెలుగును కాస్తా వెలుతురు చేస్తాడు
అందుకే చంద్రుడు చందమామై అందరికీ నచ్చుతాడు.

ఉషా కిరణాలు

అనుదినం ఉదయించే ఉషా కిరణాలు
అందరికీ ఇష్ట్పడతాయి ఆ కిరణ కాంతులు
నింపుతాయి అందరి మనసులో వింత వెలుగులు
ఆ వెలుగులు చూపుతాయి సరిక్రొత్త బాటలు.....

Monday, November 19, 2007

కవితలు కేవలం మాటలే కాదు, మనసులోని భావాలు. మనసుతో అలోచించే శక్తిని కల్పించడానికి, చైతన్యాన్ని రగిలించడానికి, మనల్ని మనం దిశా నిర్దేశం చేసుకోడానికి ఝులిపించే పదునైన బాణాలు అనుటలో అతిశయోక్తి లేదు. ఆ భావాలు సామాజిక మార్పుకుపయోగపడతాయని నిరూపించేలా ఉంది 'జనసాహితి ' అందించిన "నూరు అలల హోరు" (ప్రజా సాహితి కవితలు). కేవలం ఒక భావ కవిత ఎంతో మర్పును తెచ్చి ఆలోచనలో పడేస్తుంది. అలాంటిది వెర్వేరు కవులు వ్యక్తిగతంగా, సామాజికపరంగా అందించిన వివిధ కవితలను ( వందకు పైగా) మనముందుంచి కవితా ప్రయోజనాన్ని పాఠకులూ తెలుసుకోవాలనే చిన్న ఉద్దేశంతో---


డా. బి.సూర్యారావ్ గారు రాసిన 'జెండా 'కవిత మొట్టమొదటిగా పాఠకుల మనస్సుకు హత్తుకుని వందనం చేయాలనిపించేలా ఉంది. జెండాను నిలబెట్టడమే కాదు, దాన్ని ఎగురవేసిన వాడు జెండాలాగే నిలువగలగాలి అన్న ఆయన మాటలు మన ఆశయాన్ని తెలొయజేసేలా వుంది. తరువాత ఉపాధ్యాయుల ధ్యెయాన్ని, ఏదైనా వారి చేతుల్లోనే వుందంటూ, తరగతి గదే వారికి ఆయుధమని ' కొత్తపల్లి రవిబాబు ' గారు చక్కగా వ్యక్తపరిచారు ' తరగతి గది నా తుపాకీ ' లో. ఏవరెన్ని ఆంక్షలు విధించినా భయపడకుండా, చేసే పనిని ఆపకుండా, అక్షరాలనే ఆయుధంగా చేసి రగిలించక తప్పదంటూ 'అల ' గారు రాసిన కవిత అక్షరాలకే లక్ష్నంగా ఉంది, రాయడం ఆపకూడదనే నిర్ణయం తీసుకునేలా చేస్తుంది.

కవితలు ఆలోచనల్లో పడేస్తాయి. ఆ ఆలోచన మీద కవిత రాస్తే ఎంత బావుంటుందో 'ఆశా రాజు ' గారి కవిత ద్వారా తెలుసుకోవచ్చు. 'మనిషి ఆలోచనల్ని ఎలా బంధిస్తావ్ ఆలోచనంటే నిప్పు కదా - ఆలోచనంటే సముద్రపు హోరు కదా
ఆలొచన ఎవడి చేతికి చిక్కేది కాదు - ఎవడి కాళ్ళకి మొక్కేది కాదు
ఆలోచనంటే సమస్త భూమండలం - ముంచెత్తే వాయుగుండం
ఆలోచనంటే మనిషి పిడుగవటం - మంటవ్వటం
మనిషినైతే బంధించొచ్చు కానీ ఆలోచన్ల్ని ఎలా నిషేధిస్తావ్?" అన్న ప్రశ్న రేకెత్తిస్తుంది అందరి గుండెల్లో ఆలోచనను. మరి కొంత మంది కవులు తాము తెలుసుకున్న విషయాలకు స్పందించి సూటిగా, ఘాటుగా రాసిన వాటినీ చూడొచ్చు. అందుకు ఎ. మురళీక్రిష్ణ ' గారు ఖలిస్తానీ తీవ్రవాదుల చేతుల్లో మరణించిన పాష్ అనే కవి సంస్మరణ కోసం రాసిన 'మరణం లేని అక్షరం ', చాయ్రాజ్ ' కొత్త రాగం ' కాకరాల గారు విన్నాక అభినందించేందుకు రాసిన ' భళే బాగుంది బొమ్మ ' , శాంతి - ప్రజాస్వామ్యాల కోసం ఏర్పడిన భారత - పాకిస్తాన్ ప్రజా వేదికకు వెళ్ళే దారిలో తన భావాలను కవితా రూపంగా చేసిన దివికుమార్ గారి 'ఉద్విగ్న క్షణాలు ' , కరీమ్నగర్ పోలిసుల అఘాయిత్యానికి రాజన్న గారి ప్రతిస్పందన 'ప్రక్రుతి విరుద్ధం ', అగ్రరాజ్యం చిన్న దేశాల మీద చేస్తున్న దౌర్జన్యానికి నిరసనగా వర్రే రాణి గారి 'ఎదురు దాడి ' లను ఉదాహరణలుగా చెప్పొచ్చు.


"ఓడిపోతాం .... గెలుస్తాం, ఓడిపోతూనే గెలుస్తాం, ఓటమిలోంచి గెలుపై మొలుస్తాం, మేం కొండ మోడులమై మళ్ళీ .. మళ్ళీ... చిగురిస్తూనే వుంటా" మంటూ పిడుగురాళ్ళ ప్రంతం కొండమోడులో పోలిసులు, ఫారెస్టధికారులూ కలిసి మూడు సార్లు కూల్చేసినా, తిరిగి ఇళ్ళు నిర్మించుకున్న ద్రుశ్యానికి పై విధంగా స్పందించి శ్రీ హరి గారు రాసిన "కొండ మోడు చిగురిస్తూనే వుంటుంది!" లో ఆయన భావాలు కొత్త ఆశలను, కవిత్వం మీద ఇష్టాన్ని చిగురించేలా చేస్తాయి.


ప్రక్రుతే అందం, ప్రక్రుతిలోని ప్రతీ వస్తువు అందం. అందులో సముద్రం, ఏదో చేరుకోవాలనే ఆరాటంతో ఎంత దిగినా అంతే ఎత్తుకు ఎదగాలనే ఒక స్ఫూర్తిని రగిలిస్తూంటే ఆ సముద్రంలో ఎగసిపడే అలలు, అల్లంత దూరాన కలిసిపోయాయా అన్నట్టు కనిపించే సముద్రం, ఆకాశంలో మబ్బులు, బీచ్లో కాళ్ళ కింద ఇసుకను ఎలా మర్చిపోగలం. ఇక అక్కడ వెలిగే ఆ శోభను పై పై చూడకుండా, చూపును కొంచెం వేరు చేసి చూడమంటూ, అందులో వుండే ఉప్పెనను ఉద్వేగం చేయమంటూ, జీవితాల్ని చెరువును తవ్వినట్టు తవ్వీ తవ్వీ సముద్రాన్ని నిలబెట్టమంటూ, ఆ అలల్నీ, అలల్లో కలల్నీ, కలల్లో మహోపాన్యాస విన్యాసాల్నీ లెక్కపెట్టమంటూ క్నదుకూరి శ్రీ రాములు గారి "సముద్ర సభ" ప్రక్రుతికే శోభ.

విదేశీ ఫ్యాషన్లకలవాటుపడిన ప్రజలు చేనేత విలువలను తగ్గించి, ఆ వర్గాల వారికి పూర్తిగా అన్యాయం చేస్తుంటే, ప్రభుత్వం కూడా కెవలం వారిని ఓటర్లుగానే గుర్తిస్తుందే కానీ వారి ఆకలి భాదలను గుర్తించట్లేదు. వారి ఓట్లతో నాయకులు పదవుల్లో వుంటున్నారు. మరి ఆ ఓటర్లూ, పిరికి ఊహలతో గొంతు నులుముకుని ఈ వ్యవస్థకు ఆహారమై అరిగిపోతున్నారని చల్లా విశ్వనాధంగారు "మగ్గం కొయ్యపై చేనేత తనువులు" లో కనుమరుగౌతున్న చేనేత వర్గాల కళా స్రుష్టిని కళాత్మకంగా కవితా రూపాంతరం చేశారు. నేడు ఈ సమాజంలో జరుగుతున్న దారుణాల్లో ఒకటి రైతుల ఆత్మహత్యలు. ఏదో పండించాలని, ఎంతో సంపాదించాలనే ఆశతో, వున్న డబ్బుల్ని తగలేసి, వున్న బంగారాన్ని తాకట్టు పెట్టి, వున్న అవసరాలకై కాడి కింద ఎద్దులా, కన్నీరు కార్చి, కన్న కలలన్నీ కల్లలైనప్పుడు, చేసేదేంలేక బూడిధ పాలైన ఈ రైతే, అసమర్థ ప్రభుత్వాన్ని అంతం చేయడానికీ, ఈ దోపిడీ వ్యవస్థను కూల్చి వేయడానికీ, "మళ్ళీ మళ్ళీ రైతుగానే మొలకెత్తుతా" డని పుప్పాల మట్టయ్య గారు స్పందించిన తీరు, మనిషి కన్నా వస్తువులకే నేటి ప్రపంచంలో విలువ పెరిగిందంటూ, ఆప్యాయతల్ని పెట్టుబడిగా, అభిమానాల్ని ఉత్పత్తులుగా, శ్రమను నిత్యావసర జాబితాల్లోకి చేర్చేస్తూ, మానవ సంబంధాలన్నీ వస్తు సంబంధాలయ్యాక ఇంకేం మిగిలింది, మనుషుల్ని హాలు మధ్యలో శిలల్ని చేసేస్తున్నరన్న చేదు నిజాన్ని బండ్ల మాధవరావు గారి "వస్తు ప్రవాహంలోంచి..." ఒప్పుకోక తప్పదు.

ఇక మరికొంత మంది తమ అందమైన భావాలను సొంత భావాలతో కలబోసి రాసిన కవితలు భూమి, చెట్టుం నది, దేశం, విప్లవం, మారుతున్న సమాజం, సమ్మజంలోని తీరు, వ్యక్తిగత భావాలు, ప్రక్రుతి గురించి వర్ణనలు, జరుగుతున్న అన్యాయాలు, ఒకటేమిటి కాదేది కవితకు అనర్హమనే విధంగా, తలుచుకుంటే ఆలోచనను ఆచరణ చేయొచ్చు, ఆ ఆచరణలను కవితల ద్వారా పెంపొందించుకోవచ్చనే విధంగా వున్నాయి. ఎంపిక చేసి మరీ అమర్చిన ఈ కవితా సమాహారాన్ని మనమందరం ఒక్కసారి చదవక తప్పదు, చదివాక విశ్లేషించుకోక తప్పదు, వీటిని మనకందించిన వారికి క్రుతజ్ఞత చేయక తప్పదు.
ఈ నూరు అలల హోరు

నూరు మనుషుల తీరు

వారి భావాల జోరు

చేద్దాం వాటికి జోహారు.....

నా భావం

మనసు అనేది మహా సముద్రం
ప్రేమతో నిండిన అలల ప్రవాహం

ఒక్క క్షణం ఎగసిపడే కెరటం
మరు క్షణం అంతా నిశ్శ్బ్దం

కొందరికి తెలియనిది ఆ భావం
అల్పులకు ఎప్పటికీ కాదు అర్థం...

నిజం

ఒక ప్రయోగం నేర్పుతుంది ఎన్నో పాఠాలు......
ప్రతీ పాఠం తెలుపుతుంది ఎన్నో సత్యాలు!

ఒక హ్రుదయం పలుకుతుంది ఎన్నో రాగాలు......
ప్రతీ రాగం కలిగి ఉంటుంది ఎన్నో కావ్యాలు!

ఒక నయనం చూపుతుంది ఎన్నో భావాలు.........
ప్రతీ భావం వివరిస్తుంది ఎన్నో అర్థాలు!

ఇవి ఎవరికి అర్థమవుతాయి?
మనసుతో ఆలోచించే వారికి తప్పా!!!!!!