Thursday, August 5, 2010

ఎలా చేయగలం???

ప్రతీ ఒక్కరూ నిర్మలమైన మనస్సు (Pure Heart) కై కృషి చేస్తుంటాం. అంటే అన్నీ మంచి పనులే చేయాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఎవరకీ హాని చేయకూడదు లాంటివి. కానీ ఒక్కసారి ఆలోచించిన ఆ ప్రయత్నంలో మనం ఎంతవరకూ సఫలమయ్యాం? ఎంత మంది సఫలీకృతులమయ్యాం? అంటే మాత్రం ఆ లెక్కకి మన చేతి వేళ్ళు సరిపోతాయేమో. కాదంటారా?

మనస్సనేది ఓ అద్భుతం. నిజానికి, అది నిజంగా మన నియంత్రణలోనే ఉందా? మన మనస్సును మనం నియంత్రిస్తున్నామా లేదా మన మనస్సే మనల్ని నియంత్రిస్తుందా? నిజంగా ఆలోచించవల్సిన విషయమే. ఏంటి లోపం? ఎక్కడుంది లోపం?

మన బుద్ధి , మనశ్శక్తి మొండివి, మార్చలేనివి అంటే అద్భుతం కాదు కానీ, ఆధ్యాత్మిక బోధనలు వాటి మధ్య ఉంటూ మనం చేసే పనులు, అవి మంచివా, చెడ్డవా, చెయ్యొచ్చా, చెయ్యకూడదా అనే అలోచనల్లో సహాయం చేస్తూ, కొన్ని సమయాల్లో మన మనస్సును నియంత్రించడంలో తోడ్పడుతూ, ఏదో ఓ విశ్వాసం మనల్ని , మన మనశ్శక్తిని ముందుకు నడిపిస్తున్నాయేమో, అదే ఆధ్యాత్మికతేమో అంటే మాత్రం అదో అద్భుతమే. మన విశ్వాసాలు కొన్నిసార్లు మారవచ్చు. వాటిని కాపాడుకోవాలి, వాటిని ఎప్పుడూ ఆదరించాలి, వాటితోనే జీవనం సాగించడమంటే కష్టమేమో గానీ ఎప్పటికీ ఆధ్యాత్మికతంగా ఉంటే మనలోని దుష్ట శక్తులకు, చెడ్డ పనులు చేయలన్న ఆలోచనలకు ఈ ఆధ్యాత్మికతా ధోరణి అడ్డుపడుతూండడం వల్ల మనలోని దైవత్వాన్ని పంపొందించుకోగలమేమో, మన మనస్సు మన నియంత్రణలోనే ఉంటుందేమో. ఏదేమైనా మన ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే అలా ఆధ్యాత్మికత భావనలను పెంపొందించుకోవడం అంత సులభమంటారా?
ఒక్కసారి గతాన్ని చూచిన, మనకి ఎందరో గొప్ప గొప్ప మహానుభావులున్నారు. గౌతమ బుధ్ధుడు, స్వామి వివేకానందుడు, వాళ్ళకి అంత ఆధ్యాత్మిక ధోరణి ఎలా వచ్చిందో ఎంత ఆలోచించినా నాకు తట్టదు. బహుశా వాళ్ళు అన్ని విలాసాలను, సౌకర్యాలను త్యజించి, త్యాగం చేసి, ఒక్క దైవం మీదే మనస్సు లగ్నం చేయడం వల్లా, లేదా ఆ దేవునిపై వారికున్న విశ్వాసమా? లేదా రెండూనా!! అయితే అలా అన్నింటినీ మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదేమో కానీ మనలోని ఉన్న దుష్ట శక్తులను, చెడ్డ ఆలోచనలను త్యాగం చేసి, త్యజించి, దైవత్వం మీద మనస్సు లగ్నం చేసిన నిర్మలమైన మనస్సును సాధించవచ్చేమో!!!!