Friday, May 2, 2008

రెండు జీవితాలు

అరమరికలు లేని వయసు
అలుపన్నదే ఎరుగని తనువు
ఏదైనా చేయగలనన్న మొండి దైర్యం
ఏదో చేసేయాలన్న సాహసం
అది మంచో, చెడో ఆలోచించలేని
స్థితిలో ఉన్న లేలేత మనసు
ఎగిరెగిరి పడే లేడి పిల్లలా
పూర్తిగా వికసించని మొగ్గలా
పౌర్ణమి ఇంకా రాక, ఆకాశంలో
సగం పరుచుకున్న వెన్నెలలా
ఎటువంటి బాధ్యతా లేకుండా
ఒళ్ళంతా నిండిన అహంకారంతో
స్నేహితులతో కబుర్లతో, షికార్లతో
అప్పుడప్పుడు చదవాలని గుర్తొస్తే
పుస్తకం తిరగేస్తూ, లేదంటే ఆటలతో
కాలం గడిపేస్తున్న ఆ అబ్బాయి!

పున్నమి నాడు నిండు జాబిలిలా
చిగురిస్తున్న ఆకులతో ఉన్న వసంతంలా
అందంగా మెరిసే చంద్రబింబంలా
అమ్మా నాన్నల అనురాగంతో
అక్కా తమ్ముడి ఆప్యాయతతో
ఆ నలుగరే తన లోకంగా
అయిదో వ్యక్తే అనవసరమనుకుంటూ
మరో ప్రపంచమే వద్దనుకుంటూ
ఎంతో సరదాగా ఆడుకుంటూ
అందర్నీ తన చిలిపితనంతో నవ్విస్తూ
అల్లరి చిల్లరిగా తిరిగే వయసు నుండి
అణకువుగా ఉండే వయసుకు
తనకు తెలియకుండానే ఎదిగిన ఓ అమ్మాయి!!

జీవితంలో ఎదగడానికి ఉపయోగపడేది చదువు
జీవితాంతం నిశ్చింతగా ఉండేందుకు ఉండాలి చదువు
అందుకే,
చదువుల తల్లి నిలయమైన ఓ దేవాలయం
దేవాలయం లాంటి ఆ విద్యాలయం
అర్చకుల్లాంటి అధ్యాపకులున్న ఆ నిలయం
చదువుకోవాలన్న కాంక్షకులకు సువర్ణావకాశం
ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని
జీవితంలో మంచి స్థానంలో స్థిరపడాలని
జీవితాన్ని ఆనందమయం చేసుకోడానికి.........

కలువ వంటి కళ్ళల్లో ఉన్న బెరుకును
గుండె లోతుల్లోకి నెట్టేస్తూ
నాజూకైన పాదాల్లో పుడుతున్న వణుకును
నరనరాల్లోకి నెట్టేస్తూ
అడుగుపెట్టిందా అమ్మాయి ఆనందంగా.....
మొదటి రోజు జరిగాయి పరిచయాలు
వికసించాయి స్నేహ పరిమళాలు
మొదలయ్యాయి పాఠాల బోధనలు
అంతలోనే తన తెలివికి వచ్చాయి ప్రశంసలు
ఇక తిరుగులేని ఉత్సాహం
తరిగిపోని ఉల్లాసం, ఇలా
రెండు, మూడు ...... అన్ని రోజులు
ఎంతో సంతోషం, క్లాసులో ప్రథమ స్థానం..

చల్లదనాన్ని కోరుకుంటే చిరుగాలి వస్తుందనుకుంది
అడకుండాన్నే దేవుడు వరాలిస్తాడనుకుంది
తనకేం తెలుసు?
చిరుగాలికి బదులు పెను తుఫాను వస్తుందని
అడక్కుండానే అమ్మయినా అన్నం పెట్టదని
అయినా సరే,
తనను సృష్టించిన దేవుడు సకలం మంచే చేస్తాడని
అంతా బావుంటుందనే తలంచింది??!!!

అనుకున్నట్లే జరుగుతుండడంతో మనసంతా సంతోషం
అంతా హాయిగా సాగిపోతున్న తరుణంలో
తన స్నేహితుల్లో ఒకడుగా చేరాడు
ఏ మాత్రం బాధ్యత లేని ఆ అబ్బాయి
కానీ నాకేం పోయిందనుకుంది ఆ అమ్మాయి
నలుగురితో పాటే తనూను అనుకుంది
స్నేహితులందరినీ సమానంగా భావించింది
అందరితో చేసినట్టే తనతోనూ స్నేహం చేసింది
కానీ,
ఆ అబ్బాయికి మాత్రం ఆ అమ్మాయి ముందే తెలుసు
చందమామ కోసం ఎదురు చూసే రాత్రిలా
వాన రాక కోసం ఎదురు చూసే పంటలా
విజయం కోసం వేచి చూసే వీరుడిలా
అవునా? కాదేమో? ఏమో?
ఎంతగానో ఎదురు చూశాడు, వేచి ఉన్నాడు
ఎదురు పడగానే స్నేహమన్నాడు.......
నవ్వించాడు, ఏడిపించాడు, పోటీ పడ్డాడు
ప్రతీ దానిలోనూ, స్నేహమన్నాడు.....

పరిస్థితుల ప్రభావమో, స్నేహితుల ప్రోత్సాహమో
మనసు పెట్టిన ప్రలోభమో, వయసు చేసిన ప్రమాదమో

ఆ రోజు శుభప్రదమైన శుక్రవారం
ఏప్రిల్ రెండో వారంలో ఓ డే
ప్రత్యేకంగా సంబరం చేసుకునే డే
అందరికీ నచ్చే రోజున వచచే గుడ్ఫ్రైడే..

సూర్యాస్తమయం, సంధ్యా సమయం
పగలంతా అలసి కాసేపు రిలాక్సయి
తిరిగి సాయంకాలం ఎక్స్ట్రా క్లాసులో
పాఠాలయి, పుస్తకం తిరగేస్తున్న వేళ

చేరాడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి పక్క
కొంతసేపు పాఠాలు, మరి కాస్సేపు మాటలు
అయ్యాక ఇచ్చాడు ఆమెకో మడిచిన కాగితం!!

ఏమిటా అని ఆత్రంగా తెరిచిన ఆమెకు
కలిగింది అకస్మాత్తుగా ఆశ్చర్యం
ఏమీ అర్థం కాలేదు, ఒక్క నిమిషం
అంతా అయోమయం, గందరగోళం
ఏంటీ అబ్బాయి వైనం?
మూడే పదాలున్న ఆ కాగితం
నిదానంగా ఆలోచించకపోతే
జీవితాన్నే మలుపు తిప్పే భయంకర పత్రం
తెలివితక్కువ కాని ఆ అమ్మాయి
టక్కున తేరుకుని అతన్ని మందలించి
పూర్తిగా మాట్లాడడం మానేసింది..

అనుకున్న పని సాధించకపోతే ఎలా?
'ఛీ' అన్న ఆమేతో 'రా' అనిపించకపోతే ఎలా?
అవమానం కాదా నలుగురిలో
అందుకే అసహనాన్ని దిగమింగి
అంతులేని సహనంతో ప్రతీరోజూ
ఆ కాగితంలో ఉన్న పదాలు
ఆమె వెంటపడీ మరీ చెప్పేవాడు

తిట్టినా, ఛీ కొట్టినా, బెదిరించినా
రోజూ ఒకటే పని, అదే పని
చెట్టుదిగని బేతాళుడిలా
పట్టు వదలని విక్రమార్కుడిలా
ఏ పనైనా మర్చిపోయేవాడేమో
ఈ మూడు పదాలను కాదు
వాటిని ఆమెతో చెపపడం మర్చిపోలేదు.....

ఆమెకు బయటికి వెళ్ళాలంటే భయం
అతను కనిపిస్తాడని కాదు
అతని మాటలను వినాల్సి వస్తుందని
ఆమెకు స్నేహితులతో మాట్లాడాలంటే భయం
వాళ్ళేదో అంటారని కాదు
వాళ్ళలో ఆ అబ్బాయి కూడా చేరుతాడేమోనని!!

"దేవుడా! ఎందుకిదంతా చేయిస్తున్నావు
ఆ అబ్బాయిలో మార్పే రాదా?"
అంటూ వేడుకునే సందర్భంలో
తనలో తాను పడే సంఘర్షణలో
కాలం చేసిన ఇంద్రజాలంతో
దూరంగా వేరే చోటుకి వెళ్ళిపోయాడు
హమ్మయ్య......

మళ్ళీ కొత్త వసంతం వచ్చింది
ఆ అమమాయి జీవితానికి వెలుగునిచ్చింది
ఇంకంతా హాయే కలుగుతుంది
జీవితంలో తిరుగులేదనుకుంది.!

రిస్కు లేక లైఫ్ ఉంటుందా?
జీవితమంతా సుఖమే ఉంటుందా?
తాను వెళ్ళిన దూరం తక్కువే కావడంతో
తరచూ వెనక్కి వస్తూనే ఉండేవాడు
ఆమెను కలుస్తూనే ఉండేవాడు
ఆ మూడు పదాలు చెప్తూనే ఉండేవాడు!...

"దేవుడా! ఇతనికి ఆ దూరం చాలదు
ఇంకా చాలా దూరం తీసుకుపో!"
అంటూ వేడుకునే సందర్భంలో
తనలో తాను పడే సంఘర్షణలో
దగ్గర, మనుషుల్ని దూరం చేస్తుంది
దూరం, మనుషుల్ని దగ్గర చేస్తుంది
అన్నట్లుగా, కాలం చేసిన ఇంద్రజాలంతో
ఓ రోజు ఆమెలో ఏదో అలజడి
గుండెలో మోగే ఏదో సవ్వడి
ఆ అబ్బాయిని చూడాలని, అతన్ని కలవాలని
తనతో అవే మూడు మాటలను చెప్పాలని

ఒకటే ఆత్రం, మనసు చేసింది మారాం
ఎదురు చూసింది అతని రాక కోసం!......

అంతలోనే తిరిగింది కాలం
అతన్ని కలిసిన క్షణం, చెప్పలేని ఆనందం
మనసులో మాట, అనుకున్న మాట చెప్పింది

I Love You
I Love You
I Love You........

ఇద్దరి మనసుల్లో అంతులేని ఆనందం
ఆకాశమే హద్దుగా రేగిపోవాలన్న సంతోషం
బాధ్యతలను మరువకూడదన్న ఒప్పందం
ముందుగా జీవితంలో స్థిరపడాలన్న నిశ్చయం
తర్వాత తీసుకోవాలనుకున్నారు పెద్దల సమ్మతం
ఎప్పుడూ హద్దులు దాటకుండా చేసిన పోరాటం
జీవితాంతం కలిసి ఉండాలన్న ఆరాటం
అన్నీ కుదిరాక చెప్పలేనంత ఉల్లాసం.....

ఆ ఉల్లాసంతో, చేసుకున్న బాస్లతో
జీవితాన్ని ముందుకు సాగిస్తున్న ప్రయాణంలో

ఎదురైందో ఊహించని ప్రమాదం

ఆ అబ్బాయి నచ్చక దూరంగా తీసుకెళ్ళీపో
అని ఒకప్పుడు దేవుడికి ప్రార్థన చేసింది, కానీ

ఆ అబ్బాయి నచ్చాక ఇద్దరినీ ఒకటి
చేయమని వేడుకోవడం మరచింది!!
తనకేం తెలుసు?

అన్నీ ఆ దేవుడికి ప్రత్యేకంగా చెప్పాలా?
తానే కదా సకలం చేస్తాడని తలచింది.
ఇలా జరుగుతుందని ఎలా ఊహిస్తుంది?
అయితే తన పూజకు ఎంతో బలముంది
తాను తనకు దూరంగా తీసుకెళ్ళమని
వేడుకుంటే, ఆ దేవుడు ఏకంగా

సుదూర తీరాలకు, అనంత లోకానికి
అందనంత దూరానికి, అందుకోలేనంత దూరానికి
తన దగ్గరికే తీసుకెళ్ళిపోయాడు
ఊహించని ఆ మలుపు, ఎప్పటికీ రాదు మరుపు....

ఇప్పుడేం చేయాలి? విధి రాతను చూస్తూండాలి.....
ఇంకేం చేయాలి??????????

(ఇది వాస్తవంగా జరిగిన, జరుగుతున్న జీవితం)

డార్క్నెస్ విజబుల్

విలియం గోల్డింగ్ ఆధ్యాత్మిక, నిరాశమయ, కల్పిత నవలా రచయిత. ఆయన రాసిన కథలు ఎంతో వినోదకరంగా, ఉత్కంఠభరితగా ఉంటాయి. చదవడానికి ఎక్కువ ప్రయత్నం చేయనక్కర్లేకుండా మనకు తెలియకుండానే చివరి వరకూ ఇష్టంగా చదివేలా ఉంటాయి. 20వ శతాబ్దపు సాహిత్యానికి మంచి కథలను నవలల రూపంలో అందించారు. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగింది "డార్క్నెస్విజబుల్". 1979లో పబ్లిషైన ఈ నవల 'జేమ్స్టైట్ బ్లాక్ మెమొరియల్ ప్రైజ్' ను గెలుచుకుంది. రెండో ప్రపంచ యుద్ధం గోల్డింగ్పై ఎటువంటి ప్రభావం చూపిందో తెలుస్తుంది. నిప్పుతో ప్రకాశింపజేయబడిన ఓ చీకటి పుస్తకమిది. ఈ ప్రపంచంలో దుర్మార్గానికున్న ఆధిక్యత, దాని ఆధిపత్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నవలను రచించారు గోల్డింగ్. ఈ నవలా పరిచయం మీకోసం......

మంచికీ, చెడుకీ మధ్య జరిగిన పోరాటం నుండి భౌతికంగా తప్పించుకోవడానికి చేసిన స్వాభావికమైన సాధుత్వం, నిరంతర ప్రయత్నాలకు టెర్రరిజాన్ని కాస్త జోడించి ఆధునిక సంద్ర్భానుసారంగా ఈ కథను అల్లారు. డార్క్నెస్ విజబుల్ నైతికాంశాల్లో ఖచ్ఛితమైన తీర్పునివ్వడంలో ఉన్న కష్టాలను అన్వేషిస్తుంది. వ్యక్తుల పతాక స్థాయి ప్రవర్తన, విపరీతమైన సాధుత్వం, వాళ్ళకున్న శాపాలు, వాళ్ళు పడే బాధలు ఇలా వాళ్ళ అంతరాత్మల్లో జరుగుతున్న వివాదాలను భరించే సామర్థ్యం ఉన్న వారు రక్షింపబడతారా లేదా నశిస్తారా అన్న చివరి ఫలితాన్ని ఇది చూపిస్తుంది. మరో వైపు ఈ అధ్యాత్మిక ప్రపంచంలో మన చుట్టూ, మనకు చేరువలో ఉన్న కొన్ని రహస్యాలు ఎంతో మందికి కనిపిస్తాయి లేదా తెలియకుండానే దాటి వెళ్ళిపోతాయి. ఇలా ఆధ్యాత్మిక పరిణామాల్లో జీవిస్తూ వ్యతిరేక భావాలతో ఉన్న రెండు పాత్రలనుపయోగించి గోల్డింగ్ ఈ రహస్యాలను ప్రవేశపెట్టారు. ఆ పాత్రలే మ్యాటీ, సోఫీ.

మాటీ భౌతికంగా అందంగా లేకపోయినా తన ప్రపంచంలో నిస్వార్థ ప్రేమ, అంకిత భావాలతో ఒక సాధువులా జీవిస్తాడు. తనకి వ్యతిరేకంగా సోఫీ దుర్మార్గ శక్తులకు ప్రతినిధిగా ఉండే అందమైన యువతి, తన కౄర ప్రవర్తనతో, జీవితంపై సాధారణ దృక్పథంతో ప్రపంచ వినాశనానికీ, అవ్యక్త స్థితికీ ప్రేరణ కలిగేలా ఉంటుంది, అలానే ప్రేప్రేపిస్తుంది. అన్నింటినీ ఆ దేవుడే చూస్తాడన్న నమ్మకం మ్యాటీదైతే, అవకాశం కోసం ఎదురు చూస్తుంది సోఫీ.ఈ నవల రచన తీరు ఒక్కో పాత్రను సులభంగా అర్థం చేసుకునే రీతిలో ఉంటుంది. మ్యాటీ స్వచ్ఛమైన క్రీస్తు ప్రతిమగా వర్ణించబడ్డాడు. ఎందుకంటే ఈ నవలలో మ్యాటీ అగ్ని ప్రమాదం నుండి తప్పించుకున్న ఓ మంచి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే, ఎక్కడ నుండి వచ్చాడో అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన వాడో తెలియదు కానీ మంటల్లో నుండి అద్భుతంగా, అంతే ఆశ్చర్యంగా బయటకొస్తాడు. తన ఎడమ వైపు ముఖ భాగం పూర్తిగా కాలిపోయి మాట్లాడలేని స్థితిలో ఉన్న మ్యాటీని అక్కడున్న కొంత మంది వ్యక్తులు ఆసుపత్రిలో చేర్చి, మ్యాటీ ఎవరనేది తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో వారే తనకీ రెండు క్రీస్తు పేర్లు మాథ్యూ, సెప్టిమస్గా పెట్టి పిలుస్తారు. తరువాత, మ్యాటీగా గుర్తించబడిన తనని స్కూలుకి పంపించినా అక్కడున్న పిల్లలతో, టీచర్లతో సరిగ్గా మాట్లాడలేకపోవడం, తన అందవికార ఆకృతి వల్ల ఏ పనీ చేయలేక బాధపడ్డ మ్యాటీ, కొంత మంది విద్యార్థులు, పెడిగ్రీ అనే ఓ టీచర్ సహాయంతో కాస్త చురుగ్గా తయారవుతాడు. అయితే అంతలోనే తన సహచర విద్యార్థి హెండర్సన్ అనుమానస్పద స్థితిలో మరణించడం, తన అభిమాన టీచర్ పెడిగ్రీపై అనుమానంతో ఆయన్ని జైలుకు తీసుకెళ్ళే సమయంలో అదంతా మ్యాటీ తప్పేనని, తన వల్లే అంతా జరిగిందన్న ఆయన మాటలకు మ్యాటీ ఎంతో అపరాధ భావనతో బాధపడి, హెన్డర్సన్ వినాశనానికి ఆధ్యాత్మిక శక్తి ప్రభావముందా అని అర్థం కాని ఆ వయసులో ఆలోచిస్తూ అయోమయంలో ఏం జరిగిందో అక్కడ హెడ్ మాష్టర్కి స్పష్టంగా చెప్పలేక పోవడంతో తననా స్కూలు నుండి పంపించేయడం, ఆ తరువాత ఎక్కడికి వెళ్ళినా అతన్ని తీస్కరించడంతో మ్యాటీ ఓ సంచారిలా మారిపోతాడు.

తరువాత అసలీ ప్రపంచంలో ఏం ఉందో, అంతకన్నా ముందుగా తనను తాను తెలుసుకోవాలని వేరే దేశం వెళ్ళి ఎన్నో సాహస కార్యాలు చేస్తాడు. మ్యాటీ మంచితనానికి వ్యతిరేకంగా ఇద్దరు కవలలు సోఫీ, ఆంటోనియాలు తమ వయసుకు మించిన దుర్మార్గాలు చేస్తుంటారు. సోఫీ, టోనీలు సహజ దుర్మార్గాన్ని ముఖాలకు తొడుకున్నట్లుగా ఉంటారు. ఆ కవలలు భౌతిక అందం వారి అంతఃచీకటిని దాచితే, మ్యాటీ నిరాకారమైన ముఖమ్, శరీరం తనలో దాగియున్న మంచితనాన్ని తెలియకుండా చేశాయి. కొన్ని సౌమ్య శక్తులు మ్యాటీ, సోఫీలను వ్యతిరేక దిశల్లో అభివృద్ధి చేశాయి. మ్యాటీ తనకు తానుగా అధ్యాత్మికంగా, నిర్మాణాత్మకంగా మారితే, సోఫీ ఏ మాత్రం మంచి లేకుండా, తన దుర్మార్గ ఆలోచనల్ని ప్రజలు అంగీకరించేలా వారిని ప్రేరేపిస్తుంది. ఈ నవల రెండో భాగం చివర్లో ఒక పిల్లడిని కిడ్నాప్ చేసి, తనని హింసించి, చమ్పేయాలనుకున్న సోఫీ దుర్మార్గం బయటపడితే, మ్యాటీ మంచితనపు శక్తులతో ఆ పిల్లాడిని రక్షించి తన మంచితనాన్ని నిరూపించుకున్నాడు. మంచి, చెడుల మార్గాలైన మ్యాటీ, సోఫీలు ఏ విధంగా ప్రభావితం చెందారో తెలుసుకోవచచు. మంచి, చెడుల మధ్య జరిగిన పోరాటంలో వాళ్ళు పడ్డ సంఘ్ర్షణను గమనించగలం.

ఇక మూడో భాగం, అధ్యాత్మిక ఏకాంత వాస స్థితిని చూపిస్తుంది. అడ్డులు, అడ్డుగోడలు మనుషులతోనే నిర్మించబడతాయి. వాటిని కూల్చేయాలి. ఇది మ్యాటీకి సాధ్యమేనని చెప్పారు. క్రీస్తు ప్రతిమ కనుక అంతరాల్లో ఉన్న రోదనను ఆపగల శక్తి మ్యాటీకున్న వరం. గొప్ప బలంతో మానవ దుర్మార్గం, వారు చేసే పాపాల కోసం విచారిస్తూ, ఇంకా మానవత్వం పై ప్రేమను చూపిసతూ నిశ్శబ్దంగా సంభాషంచగలడు. దానికి ఉదాహరణగా తన సహచరుడు హెండర్సన్ మరణం విషయంలో బంధించబడిన పెడిగ్రీ విడుదలయ్యాక మ్యాటీ అతన్ని కలిసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడి తన గురుభక్తిని చూపించాడు. మ్యాటీని క్రీస్తు త్యాగంతో పోల్చి చూపించారు గోల్డింగ్.

అయితే ఈ నవల ముఖ్య ఉద్దేశం అంతిమ తీర్పుగా కనపడిన అలాంటి తీర్పేదైనా వచ్చిందా అంటే ఖచిఛితంగా రాలేదని చెప్పొచ్చు. ఇక్కడ ఎవరూ శిక్షింపబడలేదు, ఎవరూ హర్షించబడలేదు. ఈ నవల ఒక్క తీర్పుకో, మంచితనానికో సంబంధించింది కాదు. నైతికాంశాల్లో అంతిమ తీర్పు పొందడం ఎంతో కష్టమని చెప్పడం మాత్రమే. అయితే ఇక్కడ మ్యాటీ ఆత్మగా, సోఫీ శరీరంగా వర్ణించడం జరిగింది. కానీ ఆధ్యాత్మికతలో ఉన్న నిజాన్ని ఖచ్ఛితత్వాన్ని ఖచ్ఛితంగా చెప్పలేం. ఇంకా ఆ ఆధ్యాత్మికతతో మ్యాటీకున్న సంబంధ్మేంటో కూడా చెప్పలేం. మ్యాటీకి అసాధ్యమైన డిమాండ్లను చేస్తున్న ఆత్మలో ఉన్న అసలైన అంశాన్ని కూడా చెప్పలేం.

కానీ, ఈ డార్క్నెస్ విజ్బుల్లో ఒక అందవికారమైన, ఎవరూ తాకడానికి కూడా ఇష్టపడని, అందరూ ధూషించే ఓ వ్యక్తి తనలోని అపారమైన ఆత్మవిశ్వాసంతో ఒక్కడే ఒంటరిగా దుర్మార్గానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో సాధించిన విజయం మానవుల ధైర్యానికి ఒక ఉత్సాహం, ఉల్లాసం, ప్రోత్సాహాలకు చిహ్నం.