Friday, July 16, 2010

కాగలరా డిటెక్టివ్?!!!

రెండు కుటుంబాలు, అబ్బాయి తరపు వాళ్ళు, అమ్మాయి తరపు వాళ్ళు, ఇరువురి చుట్టాలు, స్నేహితులు అందరూ కలిసి సంతోషంగా జరిపే వేడుక "పెళ్ళి". అదెలా జరుగుతుందో అందరికీ తెలిసిందే. సాంప్రదాయాలు వేరైనా, పద్ధతులు వేరైనా భావన ఒక్కటే. సంబరం - సందడి ఒక్కటే. అయితే ఆ వేడుకకు ముందు ఉన్న జీవితం, తర్వాత జరగబోయే జీవితం మాత్రం అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సూటిగా చెప్పాలంటే పై పై హంగులు చూసి, భ్రమలో మోసపోతున్నామన్న సంగతి, లోతుగా తెలుసుకోకుండా తొందరపడి జీవితాన్ని నాశనం చేసుకున్నామన్న సంగతి, పెనంలో నుండి పొయ్యిలో పడ్డ నానుడిలా ఆ సుడిగుండంలో చిక్కుకున్నాకే తెలుస్తుంది. జరగబోయే దానిని ఎవరూ ఊహించలేరు, శాసించలేరు కనుక జరుగుతున్న దాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఓ అడుగు ముందుకు వేయాలని, తొందరగా పనులు చేయొచ్చు కానీ తొందరపడి పనులు చేయకూడదన్న విషయాన్ని ఓసారి అందరికీ గుర్తు చేద్దామనే చిన్న ప్రయత్నానికి జీవితంలో అతి పెద్ద ముఖ్య ఘటన "పెళ్ళి" ని ఉదహరణగా తీసుకుని, పెళ్ళికి ముందు చేయవలసిన పనులలో జరిగిన, జరుగుతున్న కొన్ని మార్పులను సూచిస్తూ, వీలైతే మనం కూడా అనుసరించవచ్చేమో అనిపించి, దాని అవలంబన, లోటుపాట్లు, తదితర అంశాలు మీరు కూడా క్షుణ్ణంగా పరిశీలించి, సూచనలు, సలహాలు ఇస్తారని......

ఇంట్లో అమ్మాయి లేదా అబ్బాయి, ఈ రోజుల్లో బాగా స్థిరపడ్డాక పెళ్ళి చేసుకోవాలనే వారి ఆలోచనలకు అవకాశమిచ్చి, ప్రోత్సహించి, అలా స్థిరపడ్డాక, వివాహం చేయాలనే ఆలోచనతో తెలిసిన వాళ్ళనో, పెళ్ళిళ్ళ పేరయ్యనో, వివాహ వేదికలనో సంప్రదించి ఒకటి, రెండు, మూడు, ఇలా..... నచ్చేదాకా రకరకాల సంబంధాలను చూసి, కుటుంబ సాంప్రదాయం, మంచి పేరు, హోదా, పలుకుబడి, ఇరువురి విద్యార్హత, ఉద్యోగాల్లో సమానత్వం, ఇలా అన్నింటినీ ఆరా తీసి, అన్నీ బావుంటే వాటిపై ఆధారపడి అబ్బాయి-అమ్మయిలను విశ్లేషించుకుని పెళ్ళిచూపులు, ఆ తర్వాత నచ్చితే మాటలు, కట్నాలు, కానుకలు, భోజనాలు, నిశ్చితార్థం, కాస్త గడువు, పెళ్ళి, మేళతాళాలు, అక్షింతలు, ఆశీర్వాదం, అందరి మదిలో సంతోషం.

అయితే చాలామంది, మనలోనే ఎంతో మంది, కుటుంబం కోసం ఆరా తీస్తున్నారు కానీ, ఆ అబ్బాయి, అమ్మాయిల గురించి తెలుసుకోవడం లేదని అనను కానీ లోతుగా పరిశీలించడం లేదు.

భారతదేశ సాంప్రదాయం ఎంతో గొప్పదని అందరికీ తెలుసు కానీ ఈనాటి భారతీయులు పాశ్చాత్య ధోరణి మోజులో పడి మన సాంప్రదాయాలను మట్టి కరిపిస్తున్నారని ఎంత మందికి తెలుసు? ఇంకా చేదుగా చెప్పాలంటే ఇంట్లో పెద్దవాళ్ల బాధ పడలేక మన సంస్కృతిని, ఓ సారి ఇంట్లో నుండి బయటకు రాగానే విదేశీ సంస్కృతిని అనుసరిస్తున్నారంటే ఒక్కసారిగా పెద్దలు ఉలిక్కిపడక తప్పదు. మరికొంత మంది ఇంట్లో పెద్దల మాట వినకుండా, వారికి ఎదురు చెప్పిన సందర్భాలు కోకొల్లలు. అయితే మన పిల్లలే కదా అని పెద్దలు సర్దుకుపోయిన సందర్భాలెన్నో. అది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఒకే ధోరణి. దుస్తులు, వ్యావహారికం, సిగరెట్లు, పాన్ పరాగ్ లు, సెల్ ఫోన్లో కబుర్లు చెప్పడం తప్పు కాదు కానీ, అదే పనిగా మాటలు, ఫోటోలు, మెసేజ్ లు, ఇక అమ్మాయిలు మేమేం తక్కువా అన్నట్లు వ్యవహరించడం. ఈ దశలో ఇలాగే ఉంటారు తర్వాత వాళ్ళే మారుతారులే అనుకోవడమంత సులభంగా జరుగుతుందా ఆ మార్పు? నూటికో, కోటికో ఒకరిద్దరన్నట్లు ఉంటుంది ఆ మార్పు.

అయితే ఇక్కడ మరో మాట. పెళ్లైతే వాళ్ళే మారుతారులే అన్న మాట మరీ దారుణం. మొక్కై వంగనిది మానై వంగునా! జన్మనిచ్చిన పుణ్యభూమి, తల్లిదండ్రులకివ్వని గౌరవం, వేరే ఎవరికో ఇస్తారా?

ఇలా ఆలోచించకుండా, మారుతారులే అని పెళ్ళిళ్ళు చేసేసి, ఎన్నో కలలతో కొత్త జీవితంలో అదుగుపెట్టిన అమ్మాయి-అబ్బాయి కలకాలం సంతోషంగా జీవించగలరా? ఛీ! ఇక సర్దుకుపోవాలి అనుకుంటూ జీవించడం. అంతకు మించి దుర్భరమైన జీవితముంటుందా? లేదా విడిపోవడం, విడిపోవడానికా చేసుకునేది పెళ్ళి?!

ఒక ఉద్యోగం కోసం సర్టిఫికేట్లు చాలవన్నట్లు ఎవరిదో ఒకరిదైనా రిఫరెన్సు కావాల్సిన, అలా కాకుంటే ఉద్యోగాలు కష్టమైపోతున్న ఈ రోజుల్లో కుటుంబ పేరు, హోదాలను చూసేసి కట్నాలు ఇచ్చేయడం లేదా తీసుకోవడం ఎంత వరకూ సమంజసం? అందుకేనేమో, పెళ్ళికి ముందు పూర్తిగా, క్షుణ్ణంగా పరిశీలించి, కుటంబాలను కాదు, వధూవరులను, వారి గురించి ఎంక్వైరీ చేసి, వారికో కొత్త జీవితాన్ని అందించేందుకు, మన నగరాల్లో ఉన్నారో, లేరో తెలీదు కానీ మహానగరాలు -మెట్రొపాలిటన్ సిటీల్లో ఏర్పడ్డారట "MARRAIGE-PRIVATE DETECTIVES".

మన వరకు మనం ఎంత వరకూ నిఘా వేయగలం. మనకున్న పనులకు తోడు పెళ్ళంటే మరి కొన్ని అదనపు బాధ్యతలు ఎలానూ తప్పవు. ఒకవేళ వీలు చూసుకుని అలా చేసినా, మనం కనిపెడుతున్నట్లు వాళ్ళకి తెలిసిపోతే. అమ్మో! మన అభిప్రాయం - మంచి సంబంధం, చేజారిపోతుందేమో! అందుకే మనకెందుకీ గొడవ. ఆ పనిని ఈ డిటెక్టివ్స్ కీ, డిటెక్టివ్ ఏజెన్సీస్ కీ అప్పజెప్పేస్తే....

అబ్బాయి మంచివాడా, చెడ్డవాడా, నటిస్తున్నాడా, జీవిస్తున్నాడా, ఉన్న అలవాట్లు, మంచివా, చెడ్డవా, ఎంత మంది స్నేహితులు, అందులో మగవాళ్ళెంత మంది, ఆడవాళ్ళెంత మంది, వాళ్ళతో వట్టి స్నేహమేనా, గట్టిగా మరింకా ఎక్కువేదైనానా (భావం ఊహించగలరు), పాన్ షాప్ వాడికి ఈయన సిగరెట్లు, పాన్ లు, వగైరా చెత్త వల్ల ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని గంటలు ఇంట్లో గడపడానికి ఇష్ట పడతాడు, ఎంత సేపు బయట షికార్లు చేస్తాడు, ఆయన గారు చూసే సినిమాలేంటి, చేసే సిత్రాలేంటి, ఇలా అన్నింటినీ శరీరాన్ని స్కాన్ చేసే యంత్రం మాదిరి అన్నీ వాళ్ళే చూసుకుని మీ అమ్మయికి ఓ మంచి జీవితం ప్రసాదించగలరు.

అదే అమ్మాయైతే అణుకువగా ఉండేందుకు ఇష్టపడుతుందా, అందంగా ఉండేందుకు ఇష్టపడుతుందా, సేవ చేయాల్సి వస్తే చేస్తందా, చేయించుకుంటుందా, ఎంతమంది స్నేహితులు, అమ్మాయిలా, అబ్బాయిలా, వట్టి స్నేహమేనా, ఇంకా ఏమైనానా (వ్యాఖ్య కఠినంగా ఉన్నా వినక, చదవక, ఆలోచించక తప్పదు), ఆమెకు ఆలోచించగల సామర్థ్యం ఎంత? ఇతరులను ఆలోచనలో పడేసే సామర్థ్యం ఎంత?ఇలా ఏవైనా సరే పూర్తిగా ఎంక్వైరీ చేసి మీ అబ్బాయికో స్నేహితురాలు, భార్య, తల్లి, ఇలా అన్ని లక్షణమైన లక్షణాలుండే జీవిత భాగస్వామిని అందించగలరు.

అంతకన్నా మనకింకేం కావాలి? పెళ్ళి జరిగేటప్పుడు సంతోషం ఎలాగైతే ఉండాలో, పెళ్ళి తర్వాత రెట్టింపు సంతోషంగా ఉండాలంటే ఇలాంటి డిటెక్టివ్స్ మన ప్రాంతాల్లో కూడా ఉండడం శ్రేయస్కరం. రెండు జీవితాలను చక్కగా ఒక్కటి చేసేందుకు, వారు సంతోషంగా జీవితాన్ని సాగించేలా చేస్తున్న ఆ డిటెక్టివ్స్ ను నిజంగా అభినందించాల్సిందే. మనలో, మన ప్రాంతాల్లో కూడా ఎవరైనా అలా డిటెక్ట్ చేసేందుకు, అందరినీ సంతోషపరిచేందుకు డిటెక్టివ్స్ గా మారితే ఎంతో బావుంటుంది కదా! నిజానికి ఇది కూడా సమజ సేవే అని నేను భావిస్తున్నా..... కాదంటారా??!!