Monday, December 31, 2007

ఉమెన్

ఈ ప్రపంచంలో మనం మన జీవితంలో ఎన్నో రకాలుగా స్ఫూర్తి పొందుతాం. ప్రక్రుతి నుండి, పక్షుల నుండి, జంతువుల నుండి, ముఖ్యంగా గొప్ప వ్యక్తుల జీవితాల నుండి, అలా కలిగిన స్ఫూర్తి మన జీవితాలనే మార్చేస్తుంది. ఏదో సాధించాలనే తపన పెరుగుతుంది. జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. నిజానికి మనం అలా ఆనందంగా, ప్రపంచంలో మనకంటూ ఒక ప్రత్యేకత కలగాలంటే ఖచ్ఛితంగా స్ఫూర్తి కలిగే విషయాలను గమనిస్తూండాలి. అలా నేను గమనించిన, నాకు స్ఫూర్తి కలిగించిన ఒక పుస్తకం డా.కెవిఎస్ మురళీ క్రిష్ణ గారు రాసిన "ఉమెన్ - హు ఇన్స్పైర్డ్ ది వరల్డ్". ఇందులో ఆయన ప్రపంచంలోని వివిధ రంగాలలో విజయం సాధించి, వారికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని, ఈ ప్రపంచానికే స్ఫూర్తిని కలిగించే ఎంతో మంది స్త్రీల గురించి తనదైన చక్కని శైలిలో వివరించారు, ప్రపంచ వ్యాప్తంగా ఎందరి నుంచో మంచి మార్కులు కొట్టేసారు. ఇది మహిళల గురించే అయినా అందరూ తప్పక చదవాల్సిన, అందరి డెస్కులో దాచుకోవాల్సిన పుస్తకం మీ కోసం ...

గడచిన కొన్ని శతాబ్దాలుగా, స్త్రీలకు ఎటువంటి హక్కులూ లేవు, చివరికి ఓటు హక్కు కూడా. ప్రపంచంలో మూడొంతుల పని స్త్రీల ద్వారానే జరుగుతుంది కాని వారికి ప్రపంచ సంపదలో ఏడు శాతం కూడా లభించదు. దేవుడు స్త్రీ, పురుషులను సమానంగానే తయారు చేసాడు. కానీ, చాలా మంది స్త్రీలకు తమను తాము నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కూడా కలుగదు. కొంత మంది స్త్రీలు వారి పనుల ద్వారా వారిలో కాంతిని ప్రకాశింపజేస్తారు అంటే కాంతి అంత అద్భుతంగా పనులు చేస్తారు కాని వారు ప్రసరించిన కాంతి వెలుగులోకి రాదు, వెలుగునివ్వదు. అయితే ఇప్పుడు రోజులు మారాయి. వారిప్పుడు అలా లేరు. అన్నింటిలోని ముందే వున్నారు, డ్రైవరు సీటును ఆక్రమించారు. అన్ని రంగాల్లో అంటే తత్వవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా,గణిత, సాహిత్య, సాంఘిక,రచన, రాజకీయ, చిత్రలేఖన, సంగీత,కళలు, ఇలా అన్ని రంగాల్లోను ముందుకు దూసుకుపోతున్నారు, ముందు వరుసలో ఉంటున్నారు. ఈ పుస్తకంలో మనం అటువంటి పాత్రలను తమ నిజ జీవితంలో పోషించిన ఎంతో మంది స్త్రీలను చూడగలము. కాని, కొంతమంది అల్ప మానవులు మాత్రం స్త్రీలు దయ, ఓర్పు, సహనం, బాధను భరించే, పతులకు సేవ చేసే, పిల్లలను పెంచే కొన్ని క్వాలిఫికేషనుల కోసమే చదువుతున్నారంటూ, వారిని, వారి చదువుని కూడా అంటూంటారు, ఇంకా ఈ సమాజంలో స్త్రీ పాత్ర ఏమీ లేదు, వారు ఏమీ కాలేరు అంటూ అనడమే కానీ, అలా అంటూ వారేం కోల్పోతున్నారో అర్థం చే సుకోరు.

కనుక, ఇక్కడ పురుష జాతి స్వభావాన్ని మార్చుకోవడమనేది ముఖ్యం కాదు కానీ స్త్రీల పట్ల అనుకూల భావనను కలిగి వుండాలి, వారిలో దాగి ఉన్న ప్రతిభను ఒప్పుకోవాలి. 19వ శతాబ్దంలో, స్త్రీలకు ఎటువంటి అవకాశం ఇవ్వబడలేదు, ఎంతో నీచంగా చూడబడేవారు. కానీ, 21వ శతాబ్దంలో, స్త్రీ పాత్రలో ఎంతో పెరుగుదల, వారు నెమ్మదిగా, నిదానంగా ముందుకు వెళ్ళారు. ఖచ్చితంగా ఈ సమాజంలో వారికంటూ ప్రత్యేక స్థనాన్ని ఏర్పరచుకున్నారు. అలా స్థానాన్ని, విజయాన్ని దక్కించుకున్న కొంత మంది స్త్రీల జీవితాలు నిజంగా ఒక్కరినీ, ఇద్దరినీ కాదు, ఈ మొత్తం ప్రపంచానికే ఆదర్శవంతం, స్ఫూర్తిదాయకం. కొత్త ఆలోచనలను, జీవిత సరళిని మార్చారు కొంత మంది స్త్రీలు, మరి కొంత మంది తత్వవేత్తలు, తిరుగుబాటుదారులుగా, ఇంకొందరు శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, నాయకులు, పాలకులు, ధైర్య, ధీరశాలురుగా, ఇంకొందరు క్రీడల్లో, రచనల్లో ప్రతిభను చూపితే, మరికొందరు కళలలో,నటనలో, అందంలో కూడా తమ ప్రతిభను చాటుకున్నారు. వారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఎంతో చక్కగా ఆలోచించి, జీవన సరళిని మార్చుకుని, తన జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేలా చేసిన యశోధర, సిద్ధార్థుడి భార్య. ఒక కొడుకు పుట్టిన తరువాత సిద్ధార్థుడు తన కుటుంబాన్ని వదిలి బుద్ధుడిగా మారితే, యశోధర తన కొడుకుని చక్కగా పెంచి, మంచి బుద్ధులు చెప్పి, తరువాత ఆమె కూడా సన్యాసం తీసుకుని, బౌద్ధ మతంలో మొట్టమొదటి సన్యాసినిగా చరిత్రలో నిలిచింది. ఆమె ఎప్పుడూ తన కొడుకు రాహులాకు "ప్రపంచంలో అందరూ మరో జన్మ వద్దనుకుంటే, సుర్యచంద్రులతో సహా, అప్పుడు ఈ ప్రపంచం ఏమవుద్ది? అందుకే సుర్యచంద్రుల్లాగే ఎప్పుడూ జీవిద్దాం, ప్రపంచానికి 365 రోజులు, 24 గంటలు వెలుగునిద్దాం, అలా జన్మిస్తూనే ఉండాలి," అని చెప్పేది. యశోధర తత్వాన్ని మైథిలి శరన్ గుప్త్ రాసిన చాల పుస్తకాల్లో తెలుసుకోవచ్చు.

తరువాత, ఆండర్సన్ ఇ గారెట్, మొట్టమొదటిగా వైద్య శాస్త్రాన్ని అభ్యసించిన గొప్ప మహిళ. ఆమె స్త్రీల హక్కుల కోసం కూడా పోరాడి గెలిచింది. ఆన్నిబీసెంట్, భారతీయ సంస్క్రుతీ, ఆచారాలు,తత్వానికి ఆకర్షితురాలై భారతీయురాలిగా మారిపోయింది. ఎన్నో ఉద్యమాల్లో పాల్గుంది. ఆమె ప్రత్యేకంగా హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించి చరిత్రలోనే తను ఒక పుట సంపాదించుకుంది. మనకందరికీ తెలుసు కిరణ్ బేడీ,భారత ఉక్కు మహిళ, మన దేశంలో మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్. నిజానికి తాను ఐఏఎస్ కావాలనుకుంది కానీ దాంట్లో ఎంపిక అవకుండా ఐపిఎస్కు ఎంపికైంది. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె ఈ వ్రుత్తిని ఒక సవాల్గా తీసుకుంది, మంచి పేరు సాధించింది. ఆమె ఎన్నో అద్భుతమైన రచనలు కూడా చేసింది. "నవ జ్యోతి" అనే పేరుతో సాంఘిక సంస్థను స్థాపించింది. ఆమె విజయానికి గల కారణం మనకున్న భయాలను వదిలేస్తే మనం సాధించనిదంటూ ఏమీ లేదనే సిద్దాంతంపై ఆమెకున్న నమ్మకమే. నిజమే కదా. ఇక, ఇప్పుడు మహిళలందరూ తమకున్న ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కాని వారికా హక్కు ఎలా వచ్చిందో తెలియదు. ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. 1914వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మిసెస్ ఎమిలైన్ పాంకరస్ట్, ఆమె కూతురు క్రిస్టాబెల్లు ఈ మహిళా ఓటు హక్కు కోసం ఎంతో శ్రమ పడి, అప్పటి బ్రిటీష్ ప్రభుత్వానికి స్త్రీలు ఏ పనైనా చేయగలరని నిరూపించి, 1918లో 30 సంవత్సరాలు పై బడిన స్త్రీలకు ఓటు హక్కును సాధించారు. 1928లో మాత్రమే, దానిని 21 సంవత్సరాలకు తగ్గించారు. మరి వీరి గురించి మనం తెలుసుకోవాలి కదా.

ఇక మనందరికీ తెలిసిన గొప్ప స్త్రీ హెలెన్ కెల్లెర్. ఆమె పూర్తిగా గుడ్డిది, చెవిటిది అయినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా, బ్రైయిలీ లిపిలో చదవడం, రాయడం నేర్చుకుని, కేంబ్రిడ్జ్లో, ఇంగ్లీష్లో గ్రాడ్యేషన్ పూర్తి చేసి తెలివైన విద్యార్థిగా నిరూపించుకుంది. ఇంకా ఎన్నో రచనలు కూడా చేసింది. మనకు ఎన్నో లోపాలను కలిగించినా వాటికి ఒక కారణం ఉంటుంది అంతేకాక దాని బదులుగా ఆ దేవుడు మనకు ఖచ్ఛితంగా మరో ఉన్నత, ఉత్తమ లక్షణాన్ని ఇస్తాడు. జీవించడమంటే ఇవ్వడమని ఆమెకు తెలుసు. మనం ఏవి సంపాదించినా, అది మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. మనతో వుండదు. మనం సమాజానికి ఏదైతే ఇస్తామో అదే శాశ్వతం, అదే మనకు జీవితానిస్తుంది. అది ఎంత చిన్నదైనా, తక్కువైనా అదే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది. కనుక, మంచిగా వుంటూ, సమాజానికి ఎంతోకొంత సేవ చేద్దాం. మనం మన జీవితం గురించి, సమాజం గురించి ఆలోచించాలి, మన జీవితంలో ఎన్నో ఇచ్చిన ఆ దేవునికి క్రుతజ్ఞత చెప్పాలి., చివరికి మనం చేసిన దానం మనలో నవ్వుల్ని పూయిస్తుంది. అస్తమించే సూర్యుడు,"ఇప్పుడు నా పనెవరు చేస్తా," రని అడిగితే, చిన్న కొవ్వొత్తి వెలుగు,"నాకు సాధ్యమయ్యేంత వరకూ నేను చేస్తాన"ని చెప్తుంది. మనం కూడా ఆ కొవ్వొత్తిలా జీవిద్దాం.

ఇక శాస్త్రజ్ఞుల విషయానికి వస్తే ముందుగా గుర్తొచ్చేది మేడం క్యూరి. మానవుల్లో, అది, స్త్రీ ఐనా, పురుషులైనా, ప్రపంచంలోనే నోబెల్ బహుమతిని రెండు సార్లు అందుకున్న గొప్ప మహిళ. ఆ రోజుల్లో ఒక స్త్రీ సైన్స్ రంగంలో వుండడమనేది ఊహాతీతం. కానీ,సైన్స్ పరిశోధనలో ఆమెకున్న ఆసక్తే ఆమె విజయనికి దోహదపడింది. ఆమె పెళ్ళి తరువాత కూడా, తన భర్త, తాను కలిసి రేడియో ధార్మిక మూలకాలను కనిపెట్టారు. అది కాన్సర్ నిర్మూలనకు ఉపయోగపడింది. అందుకే ఆమె నోబెల్ బహుమతిని సాధించింది. రోజుకు 18 గంటలు పని చేసి, 8 సంవత్సరాల తరువాత కెమిస్ట్రీలో పరిశోధనకుగాను ఆమెకు రెండవ సారి నోబెల్ను ప్రధానం చేసారు. మిసెస్ మేరీ లావోయిసెర్, ఆధునిక కెమిస్ట్రీకి పితామహుడైన లావోయిసెర్ భార్య నిజంగా ఒక స్త్రీగా, ఒక భార్యగా ఎప్పుడూ ఆమె భర్తను ప్రోత్సహిస్తూ, అతని మరణం తరువాత కూడా అతను రాసిన రచనలను పుస్తకాలుగా ప్రచురించి, పబ్లిష్ అయ్యేలా చేసింది. ఆ శాస్త్రవేత్త గొప్పతనాన్ని ప్రపంచమంతటికీ చాటింది. ఎప్పటికీ అతనే గొప్ప ఫ్రెంచ్ శాస్త్రవేత్తగా కొనియాడబడ్డాడు. ఇప్పుడు స్త్రీలు భార్యలుగా ఎంతవరకూ తమ భర్తల జీవితం, పిల్లల జీవితం గురించి ఆలోచిస్తూ, తమకి తాము ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు? ఏదో ఒకటే చేస్తున్నారు. వారిని వారు నిరూపించుకోవటంలేదు. మేరీ లావోయీసెర్లా క్రుషి చేస్తే వారి జీవితం కూడా వెలుగులోకి వస్తుంది. వారికీ ఒక ప్రత్యేక పేజి కేటాయించబడుతుంది. ఎందుకంటే ప్రతీ మగవారు వారు చేసిన పనిని ఒక నిచ్చెన ఎక్కినట్టుగా భావిస్తే, వారు కిందికి చూస్తే కింద ఒక వ్యక్తిని చూడగలరు, ఆ వ్యక్తే "భార్య".అందుకే ప్రతీ పురుషుని విజయం వెనుకా ఒక స్త్రీ వుంటుందనే మహత్తర సత్యం లావోఇసర్స్ వల్లే వెలుగులోకి వచ్చింది. కనుక, ఏది చేసినా, ఏం జరిగినా అందులో స్త్రీ పాత్ర ఖచ్ఛితంగా వుంటుందనడానికి వెనుకాడాల్సిన పని లేదు.

తరువాత చెప్పుకోవాల్సిన వారు శకుంతలాదేవీ, గణిత ప్రావీణ్యురాలు. ఆమెను నవ కంప్యూటెర్గా వరిగణించారు. గణిత శాస్త్రంలో ఆమెకున్న పట్టు ఆమెకు గిన్నీస్ బుక్లో స్థానమిచ్చింది. ఇక సాంఘిక సంస్కరణల విషయంలో, ఫ్లోరెన్స్ నైటేంగిల్ సమాజానికి చేసిన సేవ చెప్పుకోదగింది. ఆధునిక నర్సింగ్ని స్థాపించిన ఫ్లోరెన్స్ నర్సింగ్పరంగా ఎంతో సేవ చేసింది. ఆమె తన అవసరాలను, సౌకర్యాలను త్యాగం చేసి, కేవలం అనారోగ్యంతో భాదపడే వారికి సేవ చేయడానికే తన జీవితాన్ని అంకితం చేసింది. రాత్రి వేళల కూడా ఆమె దీపాన్ని పట్టుకుని రోగులకు చికిత్స చేసేందుకై వెళ్ళేది. అందుకే ఆమె "ది లేడీ విథ్ ది లాంప్" గా పేరు పొందింది. పేషెంట్లు ఆమె నీడను సైతం చూసి చలించిపోయేవారు, ఎంతో ఆప్యాయతతో చూసేవారు. తరువాత చెప్పుకోవాల్సిన వారు మనకందరికీ బాగా తెలుసు మదర్ థెరిస్సా. ఆమె సమాజానికి చేసిన సేవ చిరస్మరణీయం, ప్రతీ స్త్రీ ఒక మదర్ థెరిస్సా కావాలనుకునేంత స్ఫూర్తిని కలిగించారు. ఒక మంచి పనిని చేయడాన్ని వాయిదా వేయద్దు. జీవితం చాల చిన్నది, ఇప్పటికే ఆలస్యమైంది. లేద్దాం, కాలాన్ని ఉపయోగిద్దాం, విజయం మనదే. ఇక మనకందరికీ తెలుసు ప్రపంచ ధనవంతుల్లో మొదటి పది మందిలో ఒకరు, ఆసియా ఖండంలో పది మంది ప్రముఖుల్లో ఒకరు, "ఇన్‌ఫోసిస్" అధినేత ఎన్ ఆర్ నారాయణ మూర్తి గారు, ఆయన వెనుక ఒక స్త్రీ ఉన్నారు, ఆమె వారి భార్య సుధా మూర్తి. టాటా టెల్కొలో పని చేసిన మొట్టమొదటి మహిలా ఇంజినీర్. 1000 స్కూళ్ళకు, 4000 లైబ్రరీలు, అనేక మంది పిల్లలు, స్త్రీ విద్యా కార్యక్రమాలకు ముఖ్య పోషకురాలు ఆమె, మంచి రచయిత్రి కూడా. ఆమె రాసిన "గ్రాండ్మా కథలు" అందరూ చదవాల్సిన పుస్తకం.

గొప్ప దేశభక్తులు కూడా ఉన్నారు. అలా చూస్తే ఝాన్సీ రాణీ లక్ష్మీ భాయిని మించిన వారెవరూ లేరు. ఆమె చిన్నప్పుడే గుర్రపు స్వారీ, యుద్ధ కళలు నేర్చుకుంది. తన 8వ ఏట వివాహం చేసుకుని ఝాన్సికి రాణి అయింది. తన భర్త, కొడుకుల మరణం తరువాత బ్రిటీష్ వాళ్ళు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తే లక్ష్మీ భాయ్ వేరే పిల్లాడిని దత్తత చేసుకుని , తన దేశం కోసం పోరాడి, బిడ్డను తన వెనుకకు కట్టుకుని యుద్ధ భూమికి వెళ్ళి, వారితో యుద్ధం చేసింది. ఆమె ధైర్యానికి బ్రిటీష్వారు ఆశ్చ్ర్యపడినా వెరే దారి లేక ఆమెను చంపితే గానీ రాజ్యం రాదు కనుక ఆమెను చుట్టు ముట్టారు. యుద్ధ భూమిలోనే ఆమె వీర మరణం చెందింది. తరువాత చెప్పుకోవల్సిన మహత్తర మనిషి, దేశ భక్తురాలు, రచయిత్రి, "భారత నైటింగేల్ " సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్కు మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు. ఎన్నో పుస్తకాలను కూడా రచించారు. దేశభక్తితో దేశానికి మంచి చేయాలని, దేశానికే అధ్యక్షులయారు ఇందిరా గాంధి, ఎవరూ మర్చిపోని, ప్రతీ స్త్రీ ఆదర్శవంతంగా తీసుకోవల్సిన వ్యక్తి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎంతో మంది స్త్రీలు తమ దేశాలను పాలించారు. బెనజ్జీర్ బుట్టొ, క్వీన్ విక్టోరియా, సోనియా గాంది ఇలా అందరూ స్త్రీలే.

కల్పనా చావ్లా, పేరు వినగానే మనకు గుర్తొచ్చేది దైర్యం. అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి మహిళ. కొన్ని రోజులు ఆమె అక్కడ ఉండి, ఎన్నో ఆపరేషన్లు నిర్వహించి అన్నింటా విజయం సాధించి స్త్రీలు ఏ విష్యంలోను తక్కువ కాదని, ఏ పనైనా చేయగలరని నిరూపించారు. కొంతమందికి మరణం ఉండదు. అలాగే కల్పనా చావ్లా కూడా. ఆమె భౌతికంగా మరణించినా, కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా అందరి హ్రుదయాల్లో, పుస్తకాల్లో ఆమెకు శాశ్వత జీవం, జీవితం ఉంటుంది. ఎందుకంటే మనకు గొప్ప లక్ష్యాలు సాధించాలన్న తపన ఉంటే, తప్పకుండా సాధిస్తాం. అలా సాధించినపుడు, సాధించేటప్పుడు మరణించినా, అది నిజమైన మరణం కాదు, నిజానికి అప్పుడే మన జీవితం ప్రారంభమౌతుంది! అదెలాగో మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. సునీతా విలియంస్, క్రిస్టినా డాడ్వెల్ ఇలా ఎందరో సాహస వనితలు మన దేశంలో, మన ప్రపంచంలో జన్మించారు. కొంతమంది వెలుగులోకి రాకపోయినా మన మధ్యనే ఉండి ఉంటారు, మనం వారిని వెలుగులోకి తెద్దాం, తేవడానికి ప్రయత్నిద్దాం.

అంతేకాక, క్రీడల్లోనూ స్త్రీలు వారి సత్తాను చాటుకున్నారు. జీవితాన్ని అనందమయం చేసుకున్నారు. వారిలో టెన్నిస్ క్రీడాకారిణి, క్రిస్ అవెర్ట్ సంపాదించిన పేరు ప్రఖ్యాతులు మరెవరు సాధించుండరేమో. ఆమె టెన్నిస్ నుండి రెటైర్ అవుతునప్పుడు 20,000 మంది పైగా అభిమానులు బాధపడ్డారు, కన్నీరు పెట్టుకునారు. ఎంత ఆశ్చర్యం? మనం ఆ విధంగా స్ఫూర్తి పొందాలంటే చాలా మంది క్రీడాకరులు ఉన్నరు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి విల్మా రుడాల్ఫ్. ఆమె పుట్టడమే 2 కేజీల కన్నా తక్కువ ఉంటూ, తరువాత కూడా అనేక సమస్యలతో బాధ పడింది. నిజంగా అలా ఎవరికీ జరగదేమో. తరువాత ఆమె ఎడమ కాలు పూర్తిగా నాశనమైంది. డాక్టర్లు ఇంకెన్నడూ ఆమె నడవలేదని తేల్చేశారు. ఆమె జీవితం ప్రతికూలాంశాలను సాధించిందని చెప్పొచ్చు. కానీ ఆమె అధైర్య పడకుండా ముందుగా జీవించాలనుకుంది. తన స్కూలు రోజుల్లోనే బాస్కెట్ బాల్ లో ప్రథమ స్థానం పొంది, తరువాత 16 సంవత్సరాల గ్రూప్లో ఒలింపిక్స్లో పాల్గొని, బ్రాంజ్ మెడల్ సాధించింది. విజయానికి ఎక్కడా అంతమనేదే లేదు, అది ముగింపు కాని గమ్య స్థానం. వివిధ అంశాల్లో మూడు బంగారు పతకాలను సాధించిన మొదటి అమెరికన్ స్త్రీ. ఆమె విజయానికి కారణం, ఆమె సాధించాలన్న కల. ఆమె ఆ కలను ఎప్పుడూ చెరగనివ్వలేదు. దాన్ని నిజం చేసేందుకు, తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతో కష్ట పడింది. ఒక ఆశ , నడవలేని మనిషిని కూడా పర్వతాలను ఎక్కేలా చేస్తుంది. అలా ఇక్కడ మనం ఓ సాధారణ గౄహిణి గొప్ప అథ్లెటై ఒలింపిక్స్లో ప్రపంచ రికార్డ్ సాధించి, ఆ శతాబ్దానికే ఉత్తమ మహిళా అథ్లెట్గా కీర్తించబడింది. మనం సహనాన్ని కోల్పోతే, అంతా కోల్పోతాం. ఓడిపోయేవాడు ఎప్పుడూ గెలవడు, గెలిచేవాడు ఎన్నడూ ఓడడు. ఇలా మనం మార్టినా నవ్రతిలోవా, పీ.టీ.ఉషా, సానియా మీర్జా ఎంతో మందిని చూడవచ్చు, స్ఫూర్తిని పొందవచ్చు.

తమ రచనల ద్వారా కూడా స్ఫూర్తిని నింపుతూ, తద్వారా ఆ రచనలు చేసిన వ్యక్తులనే స్ఫూర్తిగా తీసుకునేలా వుండే వ్యక్తులు అని ఫ్రాంక్, ఆమె రాసిన డైరి 19 భాషల్లో ప్రచురించబడి, రెండు మిలియన్ల కాపీలు అమ్ముడయ్యాయి అంటే అది ఎంత ప్రభావితపరిచే రచనో. ఇల ఎంతో మంది స్త్రీలు వారి రచనలను మనకందించారు. జె.కె.రౌలింగ్- హ్యారి పాటర్, కమలా దాస్ - తన జీవిత చరిత్ర, "మై స్టోరీ" , మేధా పాట్కర్ - సాంఘిక, పర్యావరణాలపై చేసిన రచనలు, హిందూ వేదాంతం, హిందూ దేవతలపై, తోరూ దత్ చేసిన రచనలు నిజంగా అద్భుతం. లతా మంగేష్కర్, గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, ప్రపంచ గిన్నీస్ బుక్లో కూడా స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రతీ రోజూ ప్రపంచంలో ఎక్కడో ఓ చోట, ఏ మూలనో ప్రతీ సెకను, ప్రతీ నిముషం లేదా రోజంతా ఆమె గొంతుని పాటల రూపంలో వింటూనే ఉంటాం. ఎమ్మెస్ సుబ్బ లక్ష్మి గారి సంగీతం కూడా చాల మందిని ప్రభావితం చేయగలదు. ఏక్తా కపూర్, అమ్రితా షెర్గల్, ఇలా చాలా మంది తమ కళల్లో పేరు సంపాదించుకున్నారు. అందంలో, అందంతో కూడా డయాన,క్లియోపాత్ర, సమతా ఫాక్స్, ఎలిజిబెత్ టేలర్, హేమా మాలిని, నర్గిస్ దత్, మడోన్నాలు ప్రపంచ చరిత్రలో తమ మార్కును వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పేజీలైనా సరిపోవు. ఇంకా మనం రుక్మిణీ దేవీ అరుంధల్, గొప్ప థింకర్, సిరిమావొ బండారు నాయక- ప్రపంచ మొదటి మహ్ళా ప్రధాన మంత్రి, భారత దేశంలో మెరుగులు దిద్దుకున్న జయ లలిత, మేనకా గాంధి, ప్రియా టెండూల్కర్, ప్రియాంకా గాంధీ, మిథాలీ రాజ్, వసుంధరా రాజే వంటి గొప్ప స్త్రీలను చూడవచ్చు, వారిలా మనమూ కావచ్చు. ఇన్సులిన్ నుండి అనేక యాంటీ బయాంటిక్స్ను ఉత్పత్తి చేస్తూ, ఫార్మా రంగంలోనే 1000 కోట్ల టర్నోవర్ను చేస్తున్న కిరణ్ మజూందర్ షా, మొదట్లో డాన్స్ తప్పా ఏమీ నేర్చుకోక, ఇద్దరు పిల్లల తల్లయిన ప్రీతా రెడ్డి, ఇప్పుడు అపోలో గ్రూప్ హాస్పిటల్లకు నిర్వాహక కార్యదర్శి, షబానా ఆజ్మి- ప్రఖ్యాత సినీ తార, అరుంధతీ రాయ్, భరతీయ ఆంగ్ల రచయిత్రీ, బృందా కారత్, స్త్రీ ఉద్యమకారి అందరూ స్త్రీలే, స్ఫూర్తిమంతులే.

ఆ దేవుడు స్త్రీ జాతికిచ్చిన వరాలు రెండు. ఒకటి మాతృత్వం, రెండు అందం. కొన్ని ప్రతికూలాంశాలనూ ఇచ్చాడనుకోండి. వాటిని మనం ఈ పుస్తకం చివరి పేజీల్లో చూడవచ్చు. కానీ, వాటిని అనుకూలంగా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా స్త్రీ, పురుషులు ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. అందరూ సమనమే. మనది పురుష జాతీ కాదు, స్త్రీ జాతీ కాదు, అలా అని మానవ జాతీ కాదు.మనది జంతు జాతి. ఏదీ ఎక్కువా కాదు, ఏదీ తక్కువా కాదు. మనందరం ఈ సజీవ నిజాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలన్న మురళీ కృష్ణగారి మాటలతో నేను ఏకీభవిస్తాను. "ఉమెన్ " పుస్తకం చదివితే మీరూ ఏకీభవిస్తారు.

Monday, November 26, 2007

సూర్యుడు వస్తూ వెలుతురును తెస్తాడు
వెళ్తూ ఆ వెలుతురును తీసి చీకటినిస్తాడు
చంద్రుడు వస్తూ ఆ చీకటికి వెలుగు తెస్తాడు
వెళ్తూ వెలుగును కాస్తా వెలుతురు చేస్తాడు
అందుకే చంద్రుడు చందమామై అందరికీ నచ్చుతాడు.

ఉషా కిరణాలు

అనుదినం ఉదయించే ఉషా కిరణాలు
అందరికీ ఇష్ట్పడతాయి ఆ కిరణ కాంతులు
నింపుతాయి అందరి మనసులో వింత వెలుగులు
ఆ వెలుగులు చూపుతాయి సరిక్రొత్త బాటలు.....

Monday, November 19, 2007

కవితలు కేవలం మాటలే కాదు, మనసులోని భావాలు. మనసుతో అలోచించే శక్తిని కల్పించడానికి, చైతన్యాన్ని రగిలించడానికి, మనల్ని మనం దిశా నిర్దేశం చేసుకోడానికి ఝులిపించే పదునైన బాణాలు అనుటలో అతిశయోక్తి లేదు. ఆ భావాలు సామాజిక మార్పుకుపయోగపడతాయని నిరూపించేలా ఉంది 'జనసాహితి ' అందించిన "నూరు అలల హోరు" (ప్రజా సాహితి కవితలు). కేవలం ఒక భావ కవిత ఎంతో మర్పును తెచ్చి ఆలోచనలో పడేస్తుంది. అలాంటిది వెర్వేరు కవులు వ్యక్తిగతంగా, సామాజికపరంగా అందించిన వివిధ కవితలను ( వందకు పైగా) మనముందుంచి కవితా ప్రయోజనాన్ని పాఠకులూ తెలుసుకోవాలనే చిన్న ఉద్దేశంతో---


డా. బి.సూర్యారావ్ గారు రాసిన 'జెండా 'కవిత మొట్టమొదటిగా పాఠకుల మనస్సుకు హత్తుకుని వందనం చేయాలనిపించేలా ఉంది. జెండాను నిలబెట్టడమే కాదు, దాన్ని ఎగురవేసిన వాడు జెండాలాగే నిలువగలగాలి అన్న ఆయన మాటలు మన ఆశయాన్ని తెలొయజేసేలా వుంది. తరువాత ఉపాధ్యాయుల ధ్యెయాన్ని, ఏదైనా వారి చేతుల్లోనే వుందంటూ, తరగతి గదే వారికి ఆయుధమని ' కొత్తపల్లి రవిబాబు ' గారు చక్కగా వ్యక్తపరిచారు ' తరగతి గది నా తుపాకీ ' లో. ఏవరెన్ని ఆంక్షలు విధించినా భయపడకుండా, చేసే పనిని ఆపకుండా, అక్షరాలనే ఆయుధంగా చేసి రగిలించక తప్పదంటూ 'అల ' గారు రాసిన కవిత అక్షరాలకే లక్ష్నంగా ఉంది, రాయడం ఆపకూడదనే నిర్ణయం తీసుకునేలా చేస్తుంది.

కవితలు ఆలోచనల్లో పడేస్తాయి. ఆ ఆలోచన మీద కవిత రాస్తే ఎంత బావుంటుందో 'ఆశా రాజు ' గారి కవిత ద్వారా తెలుసుకోవచ్చు. 'మనిషి ఆలోచనల్ని ఎలా బంధిస్తావ్ ఆలోచనంటే నిప్పు కదా - ఆలోచనంటే సముద్రపు హోరు కదా
ఆలొచన ఎవడి చేతికి చిక్కేది కాదు - ఎవడి కాళ్ళకి మొక్కేది కాదు
ఆలోచనంటే సమస్త భూమండలం - ముంచెత్తే వాయుగుండం
ఆలోచనంటే మనిషి పిడుగవటం - మంటవ్వటం
మనిషినైతే బంధించొచ్చు కానీ ఆలోచన్ల్ని ఎలా నిషేధిస్తావ్?" అన్న ప్రశ్న రేకెత్తిస్తుంది అందరి గుండెల్లో ఆలోచనను. మరి కొంత మంది కవులు తాము తెలుసుకున్న విషయాలకు స్పందించి సూటిగా, ఘాటుగా రాసిన వాటినీ చూడొచ్చు. అందుకు ఎ. మురళీక్రిష్ణ ' గారు ఖలిస్తానీ తీవ్రవాదుల చేతుల్లో మరణించిన పాష్ అనే కవి సంస్మరణ కోసం రాసిన 'మరణం లేని అక్షరం ', చాయ్రాజ్ ' కొత్త రాగం ' కాకరాల గారు విన్నాక అభినందించేందుకు రాసిన ' భళే బాగుంది బొమ్మ ' , శాంతి - ప్రజాస్వామ్యాల కోసం ఏర్పడిన భారత - పాకిస్తాన్ ప్రజా వేదికకు వెళ్ళే దారిలో తన భావాలను కవితా రూపంగా చేసిన దివికుమార్ గారి 'ఉద్విగ్న క్షణాలు ' , కరీమ్నగర్ పోలిసుల అఘాయిత్యానికి రాజన్న గారి ప్రతిస్పందన 'ప్రక్రుతి విరుద్ధం ', అగ్రరాజ్యం చిన్న దేశాల మీద చేస్తున్న దౌర్జన్యానికి నిరసనగా వర్రే రాణి గారి 'ఎదురు దాడి ' లను ఉదాహరణలుగా చెప్పొచ్చు.


"ఓడిపోతాం .... గెలుస్తాం, ఓడిపోతూనే గెలుస్తాం, ఓటమిలోంచి గెలుపై మొలుస్తాం, మేం కొండ మోడులమై మళ్ళీ .. మళ్ళీ... చిగురిస్తూనే వుంటా" మంటూ పిడుగురాళ్ళ ప్రంతం కొండమోడులో పోలిసులు, ఫారెస్టధికారులూ కలిసి మూడు సార్లు కూల్చేసినా, తిరిగి ఇళ్ళు నిర్మించుకున్న ద్రుశ్యానికి పై విధంగా స్పందించి శ్రీ హరి గారు రాసిన "కొండ మోడు చిగురిస్తూనే వుంటుంది!" లో ఆయన భావాలు కొత్త ఆశలను, కవిత్వం మీద ఇష్టాన్ని చిగురించేలా చేస్తాయి.


ప్రక్రుతే అందం, ప్రక్రుతిలోని ప్రతీ వస్తువు అందం. అందులో సముద్రం, ఏదో చేరుకోవాలనే ఆరాటంతో ఎంత దిగినా అంతే ఎత్తుకు ఎదగాలనే ఒక స్ఫూర్తిని రగిలిస్తూంటే ఆ సముద్రంలో ఎగసిపడే అలలు, అల్లంత దూరాన కలిసిపోయాయా అన్నట్టు కనిపించే సముద్రం, ఆకాశంలో మబ్బులు, బీచ్లో కాళ్ళ కింద ఇసుకను ఎలా మర్చిపోగలం. ఇక అక్కడ వెలిగే ఆ శోభను పై పై చూడకుండా, చూపును కొంచెం వేరు చేసి చూడమంటూ, అందులో వుండే ఉప్పెనను ఉద్వేగం చేయమంటూ, జీవితాల్ని చెరువును తవ్వినట్టు తవ్వీ తవ్వీ సముద్రాన్ని నిలబెట్టమంటూ, ఆ అలల్నీ, అలల్లో కలల్నీ, కలల్లో మహోపాన్యాస విన్యాసాల్నీ లెక్కపెట్టమంటూ క్నదుకూరి శ్రీ రాములు గారి "సముద్ర సభ" ప్రక్రుతికే శోభ.

విదేశీ ఫ్యాషన్లకలవాటుపడిన ప్రజలు చేనేత విలువలను తగ్గించి, ఆ వర్గాల వారికి పూర్తిగా అన్యాయం చేస్తుంటే, ప్రభుత్వం కూడా కెవలం వారిని ఓటర్లుగానే గుర్తిస్తుందే కానీ వారి ఆకలి భాదలను గుర్తించట్లేదు. వారి ఓట్లతో నాయకులు పదవుల్లో వుంటున్నారు. మరి ఆ ఓటర్లూ, పిరికి ఊహలతో గొంతు నులుముకుని ఈ వ్యవస్థకు ఆహారమై అరిగిపోతున్నారని చల్లా విశ్వనాధంగారు "మగ్గం కొయ్యపై చేనేత తనువులు" లో కనుమరుగౌతున్న చేనేత వర్గాల కళా స్రుష్టిని కళాత్మకంగా కవితా రూపాంతరం చేశారు. నేడు ఈ సమాజంలో జరుగుతున్న దారుణాల్లో ఒకటి రైతుల ఆత్మహత్యలు. ఏదో పండించాలని, ఎంతో సంపాదించాలనే ఆశతో, వున్న డబ్బుల్ని తగలేసి, వున్న బంగారాన్ని తాకట్టు పెట్టి, వున్న అవసరాలకై కాడి కింద ఎద్దులా, కన్నీరు కార్చి, కన్న కలలన్నీ కల్లలైనప్పుడు, చేసేదేంలేక బూడిధ పాలైన ఈ రైతే, అసమర్థ ప్రభుత్వాన్ని అంతం చేయడానికీ, ఈ దోపిడీ వ్యవస్థను కూల్చి వేయడానికీ, "మళ్ళీ మళ్ళీ రైతుగానే మొలకెత్తుతా" డని పుప్పాల మట్టయ్య గారు స్పందించిన తీరు, మనిషి కన్నా వస్తువులకే నేటి ప్రపంచంలో విలువ పెరిగిందంటూ, ఆప్యాయతల్ని పెట్టుబడిగా, అభిమానాల్ని ఉత్పత్తులుగా, శ్రమను నిత్యావసర జాబితాల్లోకి చేర్చేస్తూ, మానవ సంబంధాలన్నీ వస్తు సంబంధాలయ్యాక ఇంకేం మిగిలింది, మనుషుల్ని హాలు మధ్యలో శిలల్ని చేసేస్తున్నరన్న చేదు నిజాన్ని బండ్ల మాధవరావు గారి "వస్తు ప్రవాహంలోంచి..." ఒప్పుకోక తప్పదు.

ఇక మరికొంత మంది తమ అందమైన భావాలను సొంత భావాలతో కలబోసి రాసిన కవితలు భూమి, చెట్టుం నది, దేశం, విప్లవం, మారుతున్న సమాజం, సమ్మజంలోని తీరు, వ్యక్తిగత భావాలు, ప్రక్రుతి గురించి వర్ణనలు, జరుగుతున్న అన్యాయాలు, ఒకటేమిటి కాదేది కవితకు అనర్హమనే విధంగా, తలుచుకుంటే ఆలోచనను ఆచరణ చేయొచ్చు, ఆ ఆచరణలను కవితల ద్వారా పెంపొందించుకోవచ్చనే విధంగా వున్నాయి. ఎంపిక చేసి మరీ అమర్చిన ఈ కవితా సమాహారాన్ని మనమందరం ఒక్కసారి చదవక తప్పదు, చదివాక విశ్లేషించుకోక తప్పదు, వీటిని మనకందించిన వారికి క్రుతజ్ఞత చేయక తప్పదు.
ఈ నూరు అలల హోరు

నూరు మనుషుల తీరు

వారి భావాల జోరు

చేద్దాం వాటికి జోహారు.....

నా భావం

మనసు అనేది మహా సముద్రం
ప్రేమతో నిండిన అలల ప్రవాహం

ఒక్క క్షణం ఎగసిపడే కెరటం
మరు క్షణం అంతా నిశ్శ్బ్దం

కొందరికి తెలియనిది ఆ భావం
అల్పులకు ఎప్పటికీ కాదు అర్థం...

నిజం

ఒక ప్రయోగం నేర్పుతుంది ఎన్నో పాఠాలు......
ప్రతీ పాఠం తెలుపుతుంది ఎన్నో సత్యాలు!

ఒక హ్రుదయం పలుకుతుంది ఎన్నో రాగాలు......
ప్రతీ రాగం కలిగి ఉంటుంది ఎన్నో కావ్యాలు!

ఒక నయనం చూపుతుంది ఎన్నో భావాలు.........
ప్రతీ భావం వివరిస్తుంది ఎన్నో అర్థాలు!

ఇవి ఎవరికి అర్థమవుతాయి?
మనసుతో ఆలోచించే వారికి తప్పా!!!!!!

Tuesday, September 25, 2007

పెద్దల కోసం చెప్పిన పిల్లల కథ

విలియం గోల్డింగ్ అద్భుతమైన, ఆద్యత్మికమైన, నిరశమయ, అలంకారిక భావనలు కలిగిన గొప్ప రచయిత. ఆయన తన నవలల్లో నాగరిక మనిషి ప్రవ్రుత్తికీ, చీకటి ప్రవ్రుత్తికీ మధ్య జరిగె నిరంతర సంఘర్షణ తనదైన శైలిలో చిత్రీకరించారు.

విలియం గోల్డింగ్ సెప్టెంబెర్ 19, 1911వ సంవత్సరంలొ ఇంగ్లండ్ దేశంలోని కార్న్వాల్లో జన్మించారు. ఆయన తండ్రి అలెక్ గోల్డింగ్ గొప్ప సామ్యవాది. తల్లి మిల్డ్రెడ్. గోల్డింగ్ తెలివైన, పోటీతత్వం కల్గిన వ్యక్తె కాక సంగీతమంటే ఆసక్తి కలవారు. తన తండ్రితో కలసి లాటిన్ భాష నేర్చుకొని కథలు కూడా రాశారు.తన 20వ ఏట రచయిత కావాలనుకుని 1932లో ఇంగ్లీష్ లిటరేచర్లోకి ప్రవేశించారు. వాటిని మెక్మిల్లన్ సంస్థ ప్రచురించినా విజయం సాదించ్కపోవడంతో తన జీవితం శూన్యంలా తోచింది గోల్డింగ్కు. తన స్నేహితుడు ఆడం సహయంతో ఉపాద్యనిగ చేరి పలు విషయాలను భోదిస్తూనె ఎన్నొ సంగీత, నటకాలను ప్రదర్శించారు. 1950లో 'ది సీ ' పద్యం, 1952లో 'స్ట్రేంజర్స్ ఫ్రం వితిణ్నవలలను పబ్లిషర్స్ తిరస్కరించారు. కానీ, ఫేబర్ అండ్ ఫేబర్ సంస్థ ఎడిటర్ ఛార్లెస్ మౌంటెథ్ దానికి కొన్ని సవరన్ణలు చేసి 'లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్ 'గా సెప్టెంబర్, 1954లో ప్రచురించారు. ఇదే గోల్డింగ్కు అద్భుత విజయానందించిన మొట్టమొదటి నవల. ఇక గోల్డింగ్ ఇంగ్లిష్ లిటరేచర్లో వెనుదిరిగి చూడలేదు.వరుసగ 'ది ఇన్ హెరిటర్స్ ' (1955), పించర్ మార్టిన్ (1956), ఫ్రీ ఫాల్ (1959), డార్క్నెస్ విజిబ్ల్ (1979), మరెన్నో విజయవంతమైన నవలలు రచించారు. 1983 తన జీవితంలో మరచిపోలేని సంవత్సరంగా చెప్పాలి. ఆక్స్ఫార్డ్ యూనివర్సిటి, సార్బన్ల నుండి డాక్ట్రేట్ను,ఆంగ్ల సాహిత్యంలో విశేష సేవలకుగాను నోబల్ పురస్కారాన్ని అందుకున్నారు. జూన్ ,1995లో ఆయన చివరి నవల 'ది డబల్ టంగ్ ' పబ్లిషైంది.

విలియం గోల్డింగ్ సాహిత్య ప్రయోజనాన్ని ఇలా చెప్పారు. "మానవునిలో దైర్యం, నిజయితీలను నింపడం ద్వార అది చరిత్ర దసను, దిశను మార్చేస్తుంది". చర్చిల్ లాగే గోల్డింగ్ది కూడా, సాహిత్యంలో వెలువడె భావాలు, ఆలోచనలు ప్రపంచంలో మార్పులను సూచిస్తూదేశానికి ఎంతో ఉపయోగపడతాయన్న అభిప్రాయమే.

లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్ -నవల గొప్పతనం:

విలియం గోల్డింగ్ అద్భుతంగా రాసిన ఈ నవల ఎంతో విజయం సాధించింది. భయంకర, కల్పితమైన భావాలకు దగ్గరగ ఉంచి అల్లిన ఫాంటసి కథ. అణుయుద్దం జరిగే సమయంలో కొంత మంది స్కూలు పిల్లలున్న విమానమొకటి పసిఫిక్ సముద్రంలో చిక్కుకుపోతుంది. విమాన పైలట్ మంటల్లో చనిపోవడంతో పిల్లలందరూ ఒంటరిగా మిగిలిపోతారు. అక్కడ వారేం చేశారు? ఎలా ఉన్నారు? చివరకు ఏమి జరిగింది? ఈ ప్రశ్నలకు తనదైన శైలిలో గోల్డింగ్ చెప్పిన జవాబులే ఈ నవల. పూర్తి పరిపక్వత, పరిగ్ణానం రాని చిన్న పిల్లల్ల స్వభావాన్ని, వారికుండే ఉద్దెశాలను అద్భుతంగా వివరించారు. సమాజంలోని, వ్యక్తుల తీరులోని లోపలను వెలికి తేసే ప్రయత్నమే "లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్ ". దీనిలో మనం చక్కని పరిహాసం, సింబాలిజంలను చూడవచ్చు. పాత్రలు, వాటి స్వభవాలు కూడా విభిన్నంగా ఉంటూ పన్నెండు అద్యాయాలతో ఉన్న ఈ నవలలో ముఖ్యాంశం 'మానవ సమాజ అధ్యయనం'. ఒక మంచి భావం, స్వెచ్చ, శసంతి బాల్యం నుండే రావాలని తెలిపేందుకే ఆయన కథకు చిన్న పిల్లలను ఎంచుకున్నారు. సమయం, పరిస్తితుల ప్రభావం ఒక వ్యక్తిని ఏ దిశగా తీసుకువెళతాయన్న అంశాన్ని అద్యయనం చేసి అర్థం చేసుకునే వీలు కల్పించారు గోల్డింగ్ "లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్" ద్వార.

కథ - విశ్లేషణ:
ఈ నవలలో అణు యుద్ధం కథ ప్రారంభించదానికి ఒక ఆధారం మాత్రమే. కానీ, రచయిత ముఖ్యొద్దేశం పసిఫిక్ తీరాన ద్వీపంలో చిక్కుకున్న పిల్లల స్వభావం తెలియజేయడమే.దీనిలో ముఖ్య పాత్రలు రాల్ఫ్, జాక్, పిగ్గీ, సైమన్, రాగర్, సాం, ఎరిక్, లిట్లన్స్ల చుట్టే అల్లుకుంది. వీరంతా అక్కడ ఒక క్రమ పధ్ధతిలో ఉండాలనుకుని పెద్ద వారెవరు లేకపోవడంతో వారిలో ఒక్కడైన రాల్ఫ్ను నాయకునిగా ఎన్నుకుంటారు. వారందరికి కొన్ని నియమాలను సూచిస్తాడు రాల్ఫ్. మొదటిగా శంఖం నుండి వచ్చే శబ్ధాన్ని వినగానే అందరూ సమావేశమవ్వాలి. ఇక్కడ శంఖాన్ని సాంఘికంగా ప్రజాస్వామ్యాన్ని, క్రమపధ్ధతిని, అధికారాన్ని తెలిపేంతగా సూచించడం గోల్డింగ్ సింబాలిజంకు ఉదాహరనగా చెప్పవచ్చు.

వారంతా అక్కడి నుండి బయట పడేందుకు ఆ ద్వీపంలో కొండపై నిప్పును ఏర్పరచాలని, అలా చేస్తే అతుగా వెళ్లే ప్రయాణికులు ఆ మంటను చూసి వీరిని రక్షిస్తారన్న ఆలోచన రాల్ఫ్ ఆలోచన వారు చేసే ప్రయత్నంలో లోపాలు, ఏ పధ్ధతీ లేక ఒకరికొకరు సహాయం చేసుకోకపోవడంతో ఎప్పుడూ విఫలమౌతుంది. జాక్ ఆ అడవిలోని పందులను వేతాడడంలో చూపే ఆసక్తి రాల్ఫ్కు నచ్చదు. తినడానికి అక్కడున్న చెట్ల పళ్లు సరిపోతాయి కనుక ఉండడానికి ఇళ్ళు నిర్మించాలనుకున్న రాల్ఫ్కు జాక్ సహాయం చేయకపోవడంతో వారిద్దరికీ వైరం మొదలౌతుంది. అయితే ఇదీ ఒక హక్కే. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చినట్టు వారుండొచ్చు. తోచింది చెప్పొచ్చన్న విషయం గోల్డింగ్ పై విధంగా సమర్థించారు.

అక్కడ పిల్లలంతా 12 సంవత్సరాలలోపు వారే కాబట్టి పరిపక్వత లేక ఏదీ అర్థం చేసుకోరు. అంతా బయటపడాలని చేసె ప్రయత్నంలో ఆ కొండపై ఓ వింతైన ఆకారాన్ని చూసి దానిని ఒక భయంకర వన్యమ్రుగముగా, పెద్ద రాక్షషిగా భావిస్తున్నా, రాక్షసత్వం, దుర్మార్గం మనుషుల్లోనే ఉంటాయి కాని మరెక్కడా ఉండవనే సత్యాన్ని తెలుసుకున్న సైమన్ చాలా తెలివైనవాడు, ఏ విషయంలో జోక్యం చేసుకోడు. సాం, ఎరిక్ అను కవలలు మాత్రం తాము ఆ మ్రుగాన్ని చూసామని, వారిని తరుముకొచ్చిందంటూ చెప్పినా గానీ సైమన్ నమ్మడు. పిగ్గీ తెలివైనవాడైనా చూపు సరిగా లేక ఏమీ చేయలేని, చెప్పలేని స్థితిలో ఉంటాడు. అయితే వారు చూసింది ప్యారాషూట్లో వెళ్తూ జారిపడిన ఒక వ్యక్తిని మాత్రమే.

జాక్ మాత్రం తన పని తాను చేసుకోవడమే కాక మిగిలిన వారిని కూడా రాల్ఫ్కు వ్యతిరేకంగా వుందమని చెప్పడంతో రెందు గ్రూపులుగా విడిపోతారు - వేటాడేవారు, వేటకు వెళ్లనివారు. సైమన్ ఓసారి ఒంటరిగా వెళ్లాలని ప్రయత్నించగా క్నొడపై ఓ భయంకర వన్యమ్రుగం తల కనబడి సైమన్ను అక్కడుండొద్దని, వెళ్లి అందరితోనే వుండమని హెచ్చరిస్తుది.ఆ తలనే "లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్" గా గోల్డింగ్ పేర్కున్నరు. ఇది మనకు తెలిసిన దుర్మార్గాలలో ఒకటి. 'నేను నీకు తెలుసు. నీలో భాగాన్ని. నిన్ని విడిచి వెళ్లను. వెళ్లి అందరితో వుండు లేదంటే అంతా చనిపోతారా న్న హెచ్చరికకు సైమన్ చాల భయపడిపోతాడు. ఎటువంటి చెడు భావన, దుర్మార్గాలైనా ఓ వ్యక్తితోనే పుట్ట్, వారిలోనే వుంటూ కొన్ని పరిస్తితుల్లో బయటపడతాయని గోల్డింగ్ వివరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదే ముఖ్యాంసం, కథకు కీలకం.

ఇక తాను తెలుసుకున్న విషయాన్ని అందరికీ చెప్పి వారి బాధ, భయం పోగొట్టాలనే ఉద్దేశంతో జాక్ బ్రుందం వద్దకు వెళ్తే అది గమనించని వారు సైమన్ను వన్యమ్రుగమంటూ దారుణంగా చంపేసి అక్కడున్న భయంకర మ్రుగాన్ని చంపేశామంటూ సరదా పడతారు. తర్వాత వారు చంపింది సైమన్నని తెలుసుకున్నా ఏం చేయలేని పరిస్తితి. మంచి చేయాలనుకుని ప్రాణాలు కోల్పోతాడు కనుక సైమన్ని క్రీస్తుల్లా వర్ణించారు గోల్డింగ్. లిట్లన్స్ బాగా చిన్నవారు, ఏమీ చేయలేరు. జాక్ అక్కడి నుండి తప్పించుకోవాలని, నిప్పు ఏర్పరచాలని ఏ పరికరం లేక పురాతన పద్ధతిలో చేద్దామని పిగ్గీ కళ్ళద్దాలను దొంగలించి చాల ఇబ్బంది పెడతాడు. రాల్ఫ్ సమావేశమై జాక్ను దొంగగా పిలిచాడన్న కోపంతో తన స్నేహితుడు రాగర్ సహాయంతో పిగ్గీని చంపేస్తాడు. కపట రాజకీయాలు పెద్దవారిలోనే కాదు జరిగే సంఘటనలతో చిన్నవారిలోనూ అల్లుకుపోతాయన్న అంశాన్ని ప్రస్తావించారు.

ఇక ఒంటరిగా మిగిలిన రాల్ఫ్ను కూడా తన స్నేహితులతో కలిసి చంపేయాలని ప్రయత్నిస్తే రాల్ఫ్ తప్పించుకుని అక్కడ సముద్ర తీరాన్ని చేరి, అటు వెళ్ళే వారి సహాయం కోసం ఎదురుచూస్తాడు. ఈ సన్నివేశాన్ని గోల్డింగ్ ఎంతో భయంకరంగా చిత్రీకరించారు. అటుగా వెళ్తున్న ఓ నావల్ అధికారి రాల్ఫ్ను, రాల్ఫ్ కళ్ళల్లో వేదనను గమనించి, జరిగింది తెలుసుకుని రాల్ఫ్ను తనతో తేసుకువెళ్ళాడన్న ముగింపుతో గోల్డింగ్ ఈ అమ్షాన్ని తెలిపారు.

"ఏదైనా ఒక పనిని పూర్తి చేయాలంటే ముఖ్యంగా ఆ పని పూర్తి చేయాలంటే ముఖ్యంగా ఆ పని పట్ల శ్రద్ధ, తపన, ఆ వ్యక్తుల ప్రవర్తన, క్రమశిక్షన, దన్ని అమలు చేసే విధానం, సామర్థ్యం కలిగి ఉంటే ఏ పనైనా సాద్యపడుతుంది."