Tuesday, September 14, 2010

తెలిసో, తెలీకో అంటే తప్పే .... అన్నీ తెలిసే......

మారుతున్న సమాజం..... మారుతున్న సమాజం.....
ఇది అధునాతన వినికిడి.... వింతైన సవ్వడి....
మారుతున్న సమాజానికి తగ్గట్టు మారాలి మనం.... జనం.....
ఇది నవ సందేశం ..... నూతన తరాలకు ఉపదేశం....

జరుగుతున్న ఈ మార్పు గమనం ఎటు వైపు?
మనం మారుతున్న దశలో వేసే అడుగు ఏ వైపు?

అది మంచా? చెడా? ఆశా? నిరాశా?
ఏ వైపు? అది ఎటు వైపు?

మంచి వైపే అనడానికి ఉందా ఉదాహరణ?
చెడు వైపే అనడానికి చేయొచ్చు నిర్థారణ!!
సమాజం మారుతుంది! నవ సమాజం ప్రారంభమవుతుంది!!
ఎక్కడో గౌరవ, మర్యాదలు...... ఎప్పుడూ వెక్కిరింతలు, వేళాకోళాలు....
లేదు చిన్నా, పెద్దా, ఆడా, మగా, పిల్లా, గొడ్డా....
ప్రతీదీ ఆకతాయితనమే ..... అహంభావమే.....
తెలిసో, తెలీకో అంటే తప్పే .... అన్నీ తెలిసే......

సమాజం మారుతుంది! నవ సమాజం ఆరంభమవుతుంది!!
ఎక్కడో ఆచార, సంప్రదాయాలు .... ఎప్పుడూ పాశ్చాత్య ధోరణులు, వెర్రి పోకడలు....
లేదు సిగ్గూ, ఎగ్గూ, వయసూ, వరసా, బుద్ధి, జ్ఞానం....
ప్రతీదీ విపరీతమే ..... వికృత కృత్యమే .....
తెలిసో, తెలీకో అంటే తప్పే .... అన్నీ తెలిసే ....

సమాజం మారుతుంది! నవ సమాజం సమాయత్తమవుతుంది!!
ఎక్కడో మంచి, మానవత్వం.... ఎప్పుడూ స్వార్థం, ఆవేశం, కుల, మత కలహం....
లేదు జాలీ, దయ, ఆలోచన, నీతి, ప్రేమ, సామరస్యం....
ప్రతీదీ కల్లోలమే .... భువి మీదే చూపించే నరకమే .....
తెలిసో, తెలీకో అంటే తప్పే ..... అన్నీ తెలిసే .....
అంతా తెలిసే .... ఆలోచనా రాహిత్యమే ....

సగం సగం కూడా లేని మంచీ, చెడుల ఈ సమాజం.....
మారుతున్న దిశ ఏ వైపు?
మారే దశలో వేసే అడుగు ఎటు వైపు?
ఏ వైపు? అది ఎటు వైపు????

Thursday, August 5, 2010

ఎలా చేయగలం???

ప్రతీ ఒక్కరూ నిర్మలమైన మనస్సు (Pure Heart) కై కృషి చేస్తుంటాం. అంటే అన్నీ మంచి పనులే చేయాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఎవరకీ హాని చేయకూడదు లాంటివి. కానీ ఒక్కసారి ఆలోచించిన ఆ ప్రయత్నంలో మనం ఎంతవరకూ సఫలమయ్యాం? ఎంత మంది సఫలీకృతులమయ్యాం? అంటే మాత్రం ఆ లెక్కకి మన చేతి వేళ్ళు సరిపోతాయేమో. కాదంటారా?

మనస్సనేది ఓ అద్భుతం. నిజానికి, అది నిజంగా మన నియంత్రణలోనే ఉందా? మన మనస్సును మనం నియంత్రిస్తున్నామా లేదా మన మనస్సే మనల్ని నియంత్రిస్తుందా? నిజంగా ఆలోచించవల్సిన విషయమే. ఏంటి లోపం? ఎక్కడుంది లోపం?

మన బుద్ధి , మనశ్శక్తి మొండివి, మార్చలేనివి అంటే అద్భుతం కాదు కానీ, ఆధ్యాత్మిక బోధనలు వాటి మధ్య ఉంటూ మనం చేసే పనులు, అవి మంచివా, చెడ్డవా, చెయ్యొచ్చా, చెయ్యకూడదా అనే అలోచనల్లో సహాయం చేస్తూ, కొన్ని సమయాల్లో మన మనస్సును నియంత్రించడంలో తోడ్పడుతూ, ఏదో ఓ విశ్వాసం మనల్ని , మన మనశ్శక్తిని ముందుకు నడిపిస్తున్నాయేమో, అదే ఆధ్యాత్మికతేమో అంటే మాత్రం అదో అద్భుతమే. మన విశ్వాసాలు కొన్నిసార్లు మారవచ్చు. వాటిని కాపాడుకోవాలి, వాటిని ఎప్పుడూ ఆదరించాలి, వాటితోనే జీవనం సాగించడమంటే కష్టమేమో గానీ ఎప్పటికీ ఆధ్యాత్మికతంగా ఉంటే మనలోని దుష్ట శక్తులకు, చెడ్డ పనులు చేయలన్న ఆలోచనలకు ఈ ఆధ్యాత్మికతా ధోరణి అడ్డుపడుతూండడం వల్ల మనలోని దైవత్వాన్ని పంపొందించుకోగలమేమో, మన మనస్సు మన నియంత్రణలోనే ఉంటుందేమో. ఏదేమైనా మన ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే అలా ఆధ్యాత్మికత భావనలను పెంపొందించుకోవడం అంత సులభమంటారా?
ఒక్కసారి గతాన్ని చూచిన, మనకి ఎందరో గొప్ప గొప్ప మహానుభావులున్నారు. గౌతమ బుధ్ధుడు, స్వామి వివేకానందుడు, వాళ్ళకి అంత ఆధ్యాత్మిక ధోరణి ఎలా వచ్చిందో ఎంత ఆలోచించినా నాకు తట్టదు. బహుశా వాళ్ళు అన్ని విలాసాలను, సౌకర్యాలను త్యజించి, త్యాగం చేసి, ఒక్క దైవం మీదే మనస్సు లగ్నం చేయడం వల్లా, లేదా ఆ దేవునిపై వారికున్న విశ్వాసమా? లేదా రెండూనా!! అయితే అలా అన్నింటినీ మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదేమో కానీ మనలోని ఉన్న దుష్ట శక్తులను, చెడ్డ ఆలోచనలను త్యాగం చేసి, త్యజించి, దైవత్వం మీద మనస్సు లగ్నం చేసిన నిర్మలమైన మనస్సును సాధించవచ్చేమో!!!!






Friday, July 16, 2010

కాగలరా డిటెక్టివ్?!!!

రెండు కుటుంబాలు, అబ్బాయి తరపు వాళ్ళు, అమ్మాయి తరపు వాళ్ళు, ఇరువురి చుట్టాలు, స్నేహితులు అందరూ కలిసి సంతోషంగా జరిపే వేడుక "పెళ్ళి". అదెలా జరుగుతుందో అందరికీ తెలిసిందే. సాంప్రదాయాలు వేరైనా, పద్ధతులు వేరైనా భావన ఒక్కటే. సంబరం - సందడి ఒక్కటే. అయితే ఆ వేడుకకు ముందు ఉన్న జీవితం, తర్వాత జరగబోయే జీవితం మాత్రం అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సూటిగా చెప్పాలంటే పై పై హంగులు చూసి, భ్రమలో మోసపోతున్నామన్న సంగతి, లోతుగా తెలుసుకోకుండా తొందరపడి జీవితాన్ని నాశనం చేసుకున్నామన్న సంగతి, పెనంలో నుండి పొయ్యిలో పడ్డ నానుడిలా ఆ సుడిగుండంలో చిక్కుకున్నాకే తెలుస్తుంది. జరగబోయే దానిని ఎవరూ ఊహించలేరు, శాసించలేరు కనుక జరుగుతున్న దాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఓ అడుగు ముందుకు వేయాలని, తొందరగా పనులు చేయొచ్చు కానీ తొందరపడి పనులు చేయకూడదన్న విషయాన్ని ఓసారి అందరికీ గుర్తు చేద్దామనే చిన్న ప్రయత్నానికి జీవితంలో అతి పెద్ద ముఖ్య ఘటన "పెళ్ళి" ని ఉదహరణగా తీసుకుని, పెళ్ళికి ముందు చేయవలసిన పనులలో జరిగిన, జరుగుతున్న కొన్ని మార్పులను సూచిస్తూ, వీలైతే మనం కూడా అనుసరించవచ్చేమో అనిపించి, దాని అవలంబన, లోటుపాట్లు, తదితర అంశాలు మీరు కూడా క్షుణ్ణంగా పరిశీలించి, సూచనలు, సలహాలు ఇస్తారని......

ఇంట్లో అమ్మాయి లేదా అబ్బాయి, ఈ రోజుల్లో బాగా స్థిరపడ్డాక పెళ్ళి చేసుకోవాలనే వారి ఆలోచనలకు అవకాశమిచ్చి, ప్రోత్సహించి, అలా స్థిరపడ్డాక, వివాహం చేయాలనే ఆలోచనతో తెలిసిన వాళ్ళనో, పెళ్ళిళ్ళ పేరయ్యనో, వివాహ వేదికలనో సంప్రదించి ఒకటి, రెండు, మూడు, ఇలా..... నచ్చేదాకా రకరకాల సంబంధాలను చూసి, కుటుంబ సాంప్రదాయం, మంచి పేరు, హోదా, పలుకుబడి, ఇరువురి విద్యార్హత, ఉద్యోగాల్లో సమానత్వం, ఇలా అన్నింటినీ ఆరా తీసి, అన్నీ బావుంటే వాటిపై ఆధారపడి అబ్బాయి-అమ్మయిలను విశ్లేషించుకుని పెళ్ళిచూపులు, ఆ తర్వాత నచ్చితే మాటలు, కట్నాలు, కానుకలు, భోజనాలు, నిశ్చితార్థం, కాస్త గడువు, పెళ్ళి, మేళతాళాలు, అక్షింతలు, ఆశీర్వాదం, అందరి మదిలో సంతోషం.

అయితే చాలామంది, మనలోనే ఎంతో మంది, కుటుంబం కోసం ఆరా తీస్తున్నారు కానీ, ఆ అబ్బాయి, అమ్మాయిల గురించి తెలుసుకోవడం లేదని అనను కానీ లోతుగా పరిశీలించడం లేదు.

భారతదేశ సాంప్రదాయం ఎంతో గొప్పదని అందరికీ తెలుసు కానీ ఈనాటి భారతీయులు పాశ్చాత్య ధోరణి మోజులో పడి మన సాంప్రదాయాలను మట్టి కరిపిస్తున్నారని ఎంత మందికి తెలుసు? ఇంకా చేదుగా చెప్పాలంటే ఇంట్లో పెద్దవాళ్ల బాధ పడలేక మన సంస్కృతిని, ఓ సారి ఇంట్లో నుండి బయటకు రాగానే విదేశీ సంస్కృతిని అనుసరిస్తున్నారంటే ఒక్కసారిగా పెద్దలు ఉలిక్కిపడక తప్పదు. మరికొంత మంది ఇంట్లో పెద్దల మాట వినకుండా, వారికి ఎదురు చెప్పిన సందర్భాలు కోకొల్లలు. అయితే మన పిల్లలే కదా అని పెద్దలు సర్దుకుపోయిన సందర్భాలెన్నో. అది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఒకే ధోరణి. దుస్తులు, వ్యావహారికం, సిగరెట్లు, పాన్ పరాగ్ లు, సెల్ ఫోన్లో కబుర్లు చెప్పడం తప్పు కాదు కానీ, అదే పనిగా మాటలు, ఫోటోలు, మెసేజ్ లు, ఇక అమ్మాయిలు మేమేం తక్కువా అన్నట్లు వ్యవహరించడం. ఈ దశలో ఇలాగే ఉంటారు తర్వాత వాళ్ళే మారుతారులే అనుకోవడమంత సులభంగా జరుగుతుందా ఆ మార్పు? నూటికో, కోటికో ఒకరిద్దరన్నట్లు ఉంటుంది ఆ మార్పు.

అయితే ఇక్కడ మరో మాట. పెళ్లైతే వాళ్ళే మారుతారులే అన్న మాట మరీ దారుణం. మొక్కై వంగనిది మానై వంగునా! జన్మనిచ్చిన పుణ్యభూమి, తల్లిదండ్రులకివ్వని గౌరవం, వేరే ఎవరికో ఇస్తారా?

ఇలా ఆలోచించకుండా, మారుతారులే అని పెళ్ళిళ్ళు చేసేసి, ఎన్నో కలలతో కొత్త జీవితంలో అదుగుపెట్టిన అమ్మాయి-అబ్బాయి కలకాలం సంతోషంగా జీవించగలరా? ఛీ! ఇక సర్దుకుపోవాలి అనుకుంటూ జీవించడం. అంతకు మించి దుర్భరమైన జీవితముంటుందా? లేదా విడిపోవడం, విడిపోవడానికా చేసుకునేది పెళ్ళి?!

ఒక ఉద్యోగం కోసం సర్టిఫికేట్లు చాలవన్నట్లు ఎవరిదో ఒకరిదైనా రిఫరెన్సు కావాల్సిన, అలా కాకుంటే ఉద్యోగాలు కష్టమైపోతున్న ఈ రోజుల్లో కుటుంబ పేరు, హోదాలను చూసేసి కట్నాలు ఇచ్చేయడం లేదా తీసుకోవడం ఎంత వరకూ సమంజసం? అందుకేనేమో, పెళ్ళికి ముందు పూర్తిగా, క్షుణ్ణంగా పరిశీలించి, కుటంబాలను కాదు, వధూవరులను, వారి గురించి ఎంక్వైరీ చేసి, వారికో కొత్త జీవితాన్ని అందించేందుకు, మన నగరాల్లో ఉన్నారో, లేరో తెలీదు కానీ మహానగరాలు -మెట్రొపాలిటన్ సిటీల్లో ఏర్పడ్డారట "MARRAIGE-PRIVATE DETECTIVES".

మన వరకు మనం ఎంత వరకూ నిఘా వేయగలం. మనకున్న పనులకు తోడు పెళ్ళంటే మరి కొన్ని అదనపు బాధ్యతలు ఎలానూ తప్పవు. ఒకవేళ వీలు చూసుకుని అలా చేసినా, మనం కనిపెడుతున్నట్లు వాళ్ళకి తెలిసిపోతే. అమ్మో! మన అభిప్రాయం - మంచి సంబంధం, చేజారిపోతుందేమో! అందుకే మనకెందుకీ గొడవ. ఆ పనిని ఈ డిటెక్టివ్స్ కీ, డిటెక్టివ్ ఏజెన్సీస్ కీ అప్పజెప్పేస్తే....

అబ్బాయి మంచివాడా, చెడ్డవాడా, నటిస్తున్నాడా, జీవిస్తున్నాడా, ఉన్న అలవాట్లు, మంచివా, చెడ్డవా, ఎంత మంది స్నేహితులు, అందులో మగవాళ్ళెంత మంది, ఆడవాళ్ళెంత మంది, వాళ్ళతో వట్టి స్నేహమేనా, గట్టిగా మరింకా ఎక్కువేదైనానా (భావం ఊహించగలరు), పాన్ షాప్ వాడికి ఈయన సిగరెట్లు, పాన్ లు, వగైరా చెత్త వల్ల ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని గంటలు ఇంట్లో గడపడానికి ఇష్ట పడతాడు, ఎంత సేపు బయట షికార్లు చేస్తాడు, ఆయన గారు చూసే సినిమాలేంటి, చేసే సిత్రాలేంటి, ఇలా అన్నింటినీ శరీరాన్ని స్కాన్ చేసే యంత్రం మాదిరి అన్నీ వాళ్ళే చూసుకుని మీ అమ్మయికి ఓ మంచి జీవితం ప్రసాదించగలరు.

అదే అమ్మాయైతే అణుకువగా ఉండేందుకు ఇష్టపడుతుందా, అందంగా ఉండేందుకు ఇష్టపడుతుందా, సేవ చేయాల్సి వస్తే చేస్తందా, చేయించుకుంటుందా, ఎంతమంది స్నేహితులు, అమ్మాయిలా, అబ్బాయిలా, వట్టి స్నేహమేనా, ఇంకా ఏమైనానా (వ్యాఖ్య కఠినంగా ఉన్నా వినక, చదవక, ఆలోచించక తప్పదు), ఆమెకు ఆలోచించగల సామర్థ్యం ఎంత? ఇతరులను ఆలోచనలో పడేసే సామర్థ్యం ఎంత?ఇలా ఏవైనా సరే పూర్తిగా ఎంక్వైరీ చేసి మీ అబ్బాయికో స్నేహితురాలు, భార్య, తల్లి, ఇలా అన్ని లక్షణమైన లక్షణాలుండే జీవిత భాగస్వామిని అందించగలరు.

అంతకన్నా మనకింకేం కావాలి? పెళ్ళి జరిగేటప్పుడు సంతోషం ఎలాగైతే ఉండాలో, పెళ్ళి తర్వాత రెట్టింపు సంతోషంగా ఉండాలంటే ఇలాంటి డిటెక్టివ్స్ మన ప్రాంతాల్లో కూడా ఉండడం శ్రేయస్కరం. రెండు జీవితాలను చక్కగా ఒక్కటి చేసేందుకు, వారు సంతోషంగా జీవితాన్ని సాగించేలా చేస్తున్న ఆ డిటెక్టివ్స్ ను నిజంగా అభినందించాల్సిందే. మనలో, మన ప్రాంతాల్లో కూడా ఎవరైనా అలా డిటెక్ట్ చేసేందుకు, అందరినీ సంతోషపరిచేందుకు డిటెక్టివ్స్ గా మారితే ఎంతో బావుంటుంది కదా! నిజానికి ఇది కూడా సమజ సేవే అని నేను భావిస్తున్నా..... కాదంటారా??!!

Sunday, February 14, 2010

ప్రేమ - మతం - సమ్మతం

అమ్మా నాన్నల అనురాగం, అక్కా తమ్ముళ్ళ ఆప్యాయతతో
ఆ నలుగురి సహాయ, సహకారాలతో, ప్రోత్సాహాలతో
చక్కగా చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తూ...
ఆ దేవుని ఆశీస్సులతో, అందరి దీవెనలతో...
చలాకీగా ఓ వైపు, హుందాగా మరో వైపు...
మంచి పేరుతో.... అయితే పనీ లేదా కుటుంబం అనుకుంటూ....
అందరి ప్రశంసలు అందుకుంటూ తనదైన శైలిలో వ్యవహరించే ఓ అమ్మాయి....

అమ్మా నాన్నల అనురాగం, చెల్లీ తమ్ముళ్ళ ఆప్యాయతతో
వెలకట్టలేని స్నేహమందించే మిత్రుల అభిమానంతో...
వారందరి సహాయ సహకారాలతో, ప్రోత్సాహాలతో...
చక్కగా చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తూ...
ఆ దేవుని దీవెనలతో... అందరి ఆశీస్సులతో....
పెద్దల యందు వినయంతో, ఉన్న దాంట్లో పదిమందికీ సహాయమందించాలనే...
తపనతో.. అన్ని రకాలా ఉన్నతంగా ఆలోచిస్తూ....
అందరి ప్రశంసలు అందుకుంటూ తనదైన శైలిలో వ్యవహరించే ఓ అబ్బాయి....

నెల రోజుల క్రితం ఒక మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించిన ఆ అబ్బాయి
నెల రోజుల తర్వాత అదే సంస్థలో ఉద్యోగావకాశం పొందిన ఆ అమ్మాయి

ఇద్దరూ అపరిచితులు....
ఏంటో విధి చిత్రం... ఆ దేవుడు చేస్తున్న విచిత్రం...
అపరిచితులు అయ్యారు సుపరిచితులు...
ఆ తరువాత స్నేహితులు......

ఆ అబ్బాయి పేరు వింటేనే అందరిలో కలుగుతుంది ఓ గౌరవ భావం...
ఎప్పుడూ ఉండే తనని చూస్తే చాలు...
ఆ నవ్వే తన ఆభరణమా? అదే తన ధైర్యమా?.... అనిపిస్తుంది...
ఆ నవ్వు చూస్తే చాలు మన ఆనందం రెట్టింపవుతుంది...
ఎంతటి బాధైన మాయమవుతుంది....
తన నడక, తీరు, పద్ధతి బహుశా ఈ లోకంలో వేరెవరికీ ఉండదేమో....
ఇక ఇంతకన్నా ఎక్కువ చెప్తే అతిశయం అవ్వదు కానీ....
చెప్పేకన్నా ప్రత్యక్షంగా చూస్తే నమ్మకం కలుగుతుంది....

అటువంటి నమ్మకంతోనే ఆ అమ్మాయి అతనికే ప్రత్యేకంగా ఉంటే బాగుందనుకుంది
ఆ హృదయాన్ని కోరుకుంది.... అతనితోనే జీవితం అనుకుంది....
ఆ విషయం అతనితో చెప్పాలన్న ఆరాటం ....
చెప్తే అవునంటారో.. కాదంటారో అన్న సందేహం.... భయం..
తననే చూస్తూ... తనతో ఉంటూ.. చెలిమే చేస్తూ....
తన తోడేకావాలనుకున్నా.. తన నీడే చేరాలనుకున్నా..
ఎందుకో చెప్పలేక గుండెల్లోనే మౌనంగా దాచేస్తున్న ప్రయత్నాన్ని జయించలేక..
సతమతమవుతూ... మాట్లడలేని తన మౌనాన్ని అర్థం చేసకోలేవా?
కళ్ళళ్ళో చూసి తనపై ఉన్న ప్రేమని తెలుసుకోలేవా?
ఆపై తన హృదయాన్ని అందంచలేవా? అనుకుంటూ...

ఆ అమ్మాయి మనసులోని మాట పెదవి దాటి బయటకు రాదా?
ఆ నిజానికి ఎప్పటికైనా జీవం వస్తుందా? జీవం లేని శిల్పంలా నిలిచిపోతుందా?
తాకితే నీటిలో నీడలా చెదిరిపోతుందా? చూడలేని కలలా కళ్ళళ్ళోనే దాగిపోతుందా?
నీలి గగనంలో నల్ల మబ్బులా కరిగిపోతందా?

ఎందుకింత ఆరాధన? అసలెందుకింత ఆవేదన?
మనసులోనే జీవిస్తున్నందుకా? కళ్ళ ముందే నిలుస్తున్నందుకా?
అసలా మాట తను పోయేలోగా బయటకు వచ్చేనా?
లేదా తనతో పాటే సమాధి అయ్యేనా?

అనుకుంటూ ప్రతీరోజూ ఆ అబ్బాయిని చూడగానే..
ఇది స్నేహం కాదు ప్రేమని చెప్పలేక..
ప్రేమని దాచి స్నేహాన్నే పంచలేక..
చెలిమి చేస్తూ... ప్రేమను దాచలేక...
సతమతమవుతున్న ఆమె మనస్సును ఓదార్చలేక..
చేస్తున్న సంఘర్షణలో ఆమెకు దక్కింది విజయం...

దైవానుగ్రహమో.. అతనికున్న ధైర్యమో..
అంతలోనే అతనే చెప్పాడు... తన మనసులో ఉన్న ఆమె భావం!!!

ఎప్పుడూ ఆమె ఊహించని పరిణామం..
అనుకోలేదు వస్తుందని ఆ నిమిషం..

అతని తీయని మాటతో... ఆమె కోరిన భావంతో...

ఆమె సాధించింది విజయం..
ఆమెకు మాత్రమే సంతోషం...
ఆమె మనసుకు మాత్రమే ఆనందం ....
కానీ, ఆ విజయం నిలుస్తుందా?
జీవితాంతం ఆమెతో ఉంటుందా?

మళ్ళీ మొదలైంది సంఘర్షణ...
ఇప్పుడు ఇద్దరికీ....
ఎప్పుడు అంతమవుతుందో తెలియని వేదన...
అసలు అంతమవుతుందా? వారికి విజయాన్నిస్తుందా?
లేదా వారితో పాటే అంతమవుతుందా? ఆలోచనలకు లేదు అంతం....

ఇంతలోనే వచ్చింది మరో సమయం... విజయం...
మరో మంచి సంస్థలో చక్కని అవకాశం..
అతను వెళ్ళాల వద్దా... అనే సందేహం...

అయితే జీవితంలో ముఖ్యం ఉన్నత స్థానానికి వెళ్ళడం
ఇంకా మంచి పేరు సంపాదించుకోవడం... మంచిగా స్థిరపడడం..

సంతోషం.... బాధ..... కలయికల మధ్య వీడ్కోలు...
ఇద్దరూ ఇరు చోట్ల.... కానీ,
ఇద్దరి మనసుల్లో ఒకే భావం...
ఒకరి కోసం ఒకరనుకునే స్వభావం...
అన్ని విషయాల్లోనూ సామ్యం..

ప్రతీక్షణం పిల్లల కోసమే ఆలోచించే ఆ తల్లి మనసు
ఆ అమ్మాయిని అంత మంచి స్థితికి తీసుకొచ్చిన ఆ మనసు
మా అమ్మాయి ఎప్పుడూ సరియైన నిర్ణయమే తీసుకుంటుందనే

నమ్మకమున్న ఆ మనసు
ఈ నిర్ణయాన్ని ఎందుకో అంగీకరించలేకపోతుంది...

ఏమిటి కారణం? ఆ అమ్మాయి నిర్ణయం నేరమా? లేదా ఆలోచనలో లోపమా?
కాదు.. ఆ నిర్ణయం కాదు నేరం.. ఆ ఆలోచనలో లేదు లోపం...

మరెందుకు? అందరూ ఆలోచించేది ఒక్కటే.. మతం! జనం!! సంఘం!!!

అబ్బాయి మంచివాడే.. కానీ, మతాలు వేరు...
మంచివాడు కనుక అభ్యంతరం లేదు... కానీ, సంఘంలో పేరు..
చేసేది మంచి పనైతే సొసైటీ కోసం ఆలోచించాల్సిన పని లేదు.. కానీ, జనం ఏమనుకుంటారు?..

ఇవే సందేహాలు... ఎంతో గౌరవమైన కుటుంబం....
తర్వత పరిస్థితి ఎలా ఉంటుందో?....

అయితే ఈ ఆలోచనలేవీ నిలవలేదు
అతని మంచితనం ముందర!!!!

పెళ్ళి అనే శాశ్వత బంధానికి కావాల్సింది నమ్మకం కానీ మతం కాదు...
ఇరువురి మధ్య ఉండాల్సింది ప్రేమ కానీ సంఘం కాదు... జనం కాదు...

అంటూ ఇరు కుటుంబాలు వచ్చిన ఏకాభిప్రాయానికి వందనాలు....
అంత పెద్ద మనస్సుతో అర్థం చేసుకున్న తల్లిదండ్రులకు వారు జన్మించినందుకు కృతజ్ఞతలు...
అలా సృష్టించి, పుట్టించిన ఆ దేవునుకి ఆత్మసంతృప్తితో నమస్కారాలు.....

ఆ దైవ లీలతో ప్రేమగా మారిన ఆ పరిచయం, స్నేహం....
ప్రేమికుల రోజున జరిపించాయి వారి నిశ్చితార్థం....
అదే వారి వివాహ నిశ్చయం... వింత అనుభవం...
అర్థం కాని అద్భుతం,... ప్రేమపై నమ్మకం....
ప్రేమలో విశ్వాశం.... అందుకు వారి ప్రేమే నిదర్శనం....
ఈ ప్రేమికుల రోజే సాక్ష్యం....
ఆదివారం (14-02-2010)కి గడిచేను ఒక సంవత్సరం...

సంతోషంగా... పరస్పర సహాయ సహకారాలతో....
అందరి ఆశీస్సులతో.... దేవుని చల్లని దీవెనలతో....
అమ్మ మనస్సు రెట్టింపు సంతోషంతో.....
కూతురి సంతోషంతో.... అల్లుడు కాదు కొడుకులా ఉంటున్న అల్లుడిని చూస్తున్న సంతోషంతో.......