Wednesday, February 27, 2008

పెళ్ళి చూపులు

అనాదిగా వస్తున్న ఆచారం
చెప్పాలంటే ఇదొక గ్రహచారం
ఎప్పుడో మొదలై, ఇప్పటికీ సాగుతూ
సంతల్లో సరుకులా, అంగట్లో బొమ్మలా...

చుట్టూ తక్కువ కాకుండా పది మంది
తెలియని వారు, తెలిసిన వారూ ఉంటారు
మధ్యలో ఎలా ఉండాలో తెలియక
అంతలో ఏమి చేయాలో తోచక
అందరూ ఉన్నా ఎవరూ లేని ఒంటరై....

ఎన్నో తెలివితేటలతో అన్నింటా
విజయం సాధిస్తూ, చాకచక్యంగా
ఎంతటి పన్నైనా, తన వాక్చాతుర్యంతో
అందర్నీ మెప్పించే ఓ అమ్మాయి!!....

తన తల్లిదండ్రుల కోసం, వారి గౌరవం కోసం
తన జీవితంలో 'పెళ్ళి' అనే పనికి కట్టుబడి
"పెళ్ళి చూపులు" అనే మాటకి రాజీపడి
ఏమీ చేయలేని తరుణంలో, ఎక్కడా తలవంచని
ఆమె తలదించుకోక తప్పని పరిస్థితి....

ముందుగానే అన్ని వివరాలు తెలుసుకుని
వచ్చిన వాళ్ళు లక్ష ప్రశ్నలు వేసి
నచ్చింది! అంటే ఏ మాత్రం లేదు ఆశ్చర్యం
లేదంటే! అయినా ఉండదు ఆశ్చర్యం
కానీ, కని వాటిని లోపాలుగా ఎత్తి చూపి వెళ్ళిపోతే....

తెలిసిన వారు ఒక మాటంటేనే ఒప్పుకోం మనం
తెలియని వారు ఎదురుగానే ఎన్నో కామెంట్లు ఇచ్చేస్తుంటే
అలా అంటున్న వాళ్ళని తిట్టాలా?
అలా పిలిచిన వాళ్ళని కోప్పడాలా?
పోనీలే పాపం అని ఊరుకోవాలా?

అన్నీ మారుతున్న నేటి సమాజంలో
ఈ పద్ధతి మాత్రం మారదెందుకనో?
ఎంతో పవిత్రమనుకుంటున్న ఈ సాంప్రదాయం
మగ పిల్లల తల్లిదండ్రులు ఆశించే
లాభాలకు పెట్టుబడి లేని వ్యాపార సూత్రం....
ఒక్కసారి మొదలుపెట్టండి ఆలోచించడం!!!!

8 comments:

krishna rao jallipalli said...

నేను నా చిన్నప్పటి నుండి ఇవే విషయాలు కవితలు కథలు సినిమాలు సమావేశాలు అన్నింట్లో వింటున్నాను కంటున్నాను. ఏమి లాభం లేదు. ఎవరు మారలేదు ఏమి మారలేదు. IAS, IPS,DOCTORS,ENGINEERS, OFFICERS... ఇలా ఎంతో మంది ఎవరు అయనా.. అందరిదీ ఒకే బాట. ఒ పని చేయండి. పెళ్లి చూపులు లేకుండా మీరు పెళ్లి చేసుకొని మీ BLOG లోనే ఆ విషయం తెలుపండి. BEST OF LUCK.

lalithag said...

ప్రస్తుతానికి కుదరక పోయినా, ప్రత్యామ్నాయం సూచించండి.

డేటింగ్ మాత్రం అనకండేం.

అమ్మాయిలూ, అబ్బాయిలూ ఆలోచించండి.

mukesh said...

ఇందు మంచి విషయం బ్లాగ్ లోకి తీసు కొచ్చావు పాపం అని వదిలెయ్యలా అన్నావు. అది పాపం కాదు అనాదిగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది.కొద్ది రోజులు క్రితం మా ఊరిలో ఒక ఉపాద్యాయుడు కి మూడు సంబందాలు మిస్సయ్యయి ఐతె ఒక్కొక్కరు 10,000 20,000 చొప్పునా ఇచ్చారు ఒక ఉపద్యాయ వృత్తిలో ఉండి అంత చదువుకొని సంబందం తప్పొయినపుడు తిరిగి వాల్ల డబ్బు ఇచ్చెయ్యలి. ఆడ పిల్ల వాల్లు చాలా బాద పడతారు అది ఎంత హీనము ఒక విద్యా వేత్త కుడా అలానే ఉంటున్నాడు కాబట్టి మన యువతలొనే ముందుగా మార్పు రావలి .మార్పుని తిసుకొస్తే చాలా మంచిది మనము ఎమైనా చెయ్యగల్గితె చెయ్యాలి.ఏది ఎమైనప్పటికి మీరు చేసిన ప్రయత్నం బాగుంది.

cbrao said...

1980 లో రావలసిన కవిత ఇది. ఆడపిల్లలు ఇప్పుడు తమ కాళ్ల మీద తాము నిలబడుతున్నారు. తలదించవలసిన అవసరము ఏ మాత్రము లేదు. అబ్బాయిలతో సమానం గా అన్ని రంగాలలో ముందున్నారు. పెళ్లికి ముందే అబ్బాయితో మాట్లాడి, అబ్బాయి అభిప్రాయాలు తమకు సరిపోతవో లేదో అని సరిచూసుకుంటున్నారు. ఆడపిల్ల విద్యావంతురాలయితే, అమెరికా అబ్బాయిలు కట్న ప్రసక్తి లేకుండా వివాహానికి ముందుకొస్తున్నారు.

రాధిక said...

చాలా మంచి విషయమండి.ఈ పెళ్ళి చూపుల వ్యవహారాలు ఇంకా వున్నాయి కానీ ఐదారేళ్ళతో పోలిస్తే కొంత మార్పు చెందాయి.అసలు చదువు లేకుండా వుండేవాళ్ళ పరిస్థితి వదిలేస్తే తల్లిదండ్రులకు దూరం గా వుండి చదువుకుంటున్న/చదువుకున్న అమ్మాయిల విషయానికి వస్తే ఈ మార్పును స్పష్టం గా చూడగలం.అమ్మాయి,అబ్బాయిల పరిచయాన్ని కాలేజీలోనో,ఆఫీసులోనో ఏర్పాటు చేస్తున్నారు.అదీ కాకపోతే ఎవరో చుట్టాల/స్నేహితుల ఇంటిలో అబ్బాయి,అమ్మాయి మరియు అబ్బాయి తరుపున ఒకరు,అమ్మాయి తరుపున ఒకరు వచ్చి తంతును కానిస్తున్నారు. అమ్మాయి అబ్బాయి ఓకే అనుకున్నాకా పాత సాంప్రదాయం ప్రకారం అబ్బాయి వైపు వేలు విడిచిన చుట్టాలు,సందు చివరి ఇంటి వాళ్ళు అందరూ మందలాగా అమ్మాయి ఇంటికి వచ్చి సంతలో పశువుని చూసినట్టు చూసుకుని పోతారు.కొంత మంది అదృష్టవంతులకే ఈ సంతలో కూర్చునే దురదృష్టం తప్పుతుంది.ప్రత్యామ్నాయం కాదుగానీ ఈ చుట్టాల గొడవలు లేకుండా పెద్ద వాళ్లకి అవసరమయిన విషయాలు వాళ్ళు వాళ్ళు చూసుకుని,అమ్మాయి,అబ్బాయిని విడిగా కలిసి మాట్లాడుకునేలా చూసుకుంటే కొంతలో కొంత బాగుంటుందనుకుంటున్నాను.

రాధిక said...

రావుగారూ ఆడపిల్ల విద్యావంతురాలయితే అమెరికా అబ్బాయిలు కట్నం లకుండా చసుకోడానికి వస్తున్నరు అన్నారు.కానీ అలా ఇక్కడికి వచ్చిన ఆడపిల్లల పరిస్థితి తెలుసా? ఆ అమ్మాయి ఇష్టం వున్నా లేకపోయినా ఉద్యోగం చేయాలి.ఓక్ వేళ ఇష్టపడే వుద్యోగం చేస్తే జీతం జబ్బుల కోసం గొడవ.కట్నం ఎలాగూ అడగలేదు కదా అని బుకాయింపు.ఒక వేళ జీతం ఇవ్వనన్న అమ్మాయి తో ఎవరి లెక్కలు వాళ్ళవని,ఇంటి అద్దెలో సగం,అన్నింటిలోనూ షేరు చేసుకోవాలని రూలు.ఇలా అందరూ చేస్తున్నారని కాదు గానీ 60,70% ఇలానే చేస్తున్నారు.

Valluri Sudhakar said...

ఇంకా ఎక్కడున్నాయండి ఆ సాంప్రదాయము, చట్టుబండలూనూ. రావుగారు చెప్పినట్లు, సుమారు రెండు దశాబ్దాలక్రితం అమ్మాయిలకి అలాంటి అవస్థలు ఉండేవి. ఇప్పుడు సామాజిక పరిస్థితులలో మార్పు కనిపిస్తుంది. ఇంటర్నెట్లో వధు/వర పరిచయాలు, చాటంగులు, డెటింగులు, ఆ తర్వాత పదిరోజులలో పెళ్ళి. ఇప్పుడంతా క్విక్ మ్యారేజి బ్యూరోల దందా, కేవలం పోన్ల మీద, మెయిళ్ళమీద నడిపించేస్తున్నారు. ఇక అబ్బాయి అమ్మాయిల పెళ్ళిచూపులు పార్కులలోనో, హోటల్లలోనో జరిగిపోతున్నాయి.

Bolloju Baba said...

నేను సుమారు ఒక 10 పెళ్లి చూపులు చూసి ఉంటాను 11ఏళ్ల క్రితం సుర్యపద్మ అనే అమ్మాయితో పెళ్లి జరిగే వరకు. ఆ తరువాత ఆ విషయాలను తలచుకొంటే చిన్నతనం గా అనిపించేది. మీ కవిత చదివినతరువాత నా ఆత్మ న్యూన్యతాభావాన్ని ఇంకా ఎక్కువ చేసారు.

కానీ మనసమాజంలో ఈ రకపు చిత్రహింశ ఇంకా తప్పదేమో? పరిష్కారం ఏమిటంటారు? క్రిష్ గారు కామెంటు చేసినట్లు అన్ని సంధర్భాలలోనూ కుదరదేమో?

ఏమో ప్రస్తుతం 8 సంవత్సరాలున్న మా అమ్మాయికి కూ డా రేపు నేనే ఆవిధంగానే పెళ్లి చూపులు ఎర్రేంజ్ చెయ్యాలేమో?

మంచి ఆలోచనలను రేకెత్తించిన మీకవిత బాగుంది.

వీలైతే నాబ్లాగు చూసి సలహాలివ్వండి>

బొల్లోజు బాబా

http://sahitheeyanam.blogspot.com/